ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: విద్యుత్ ఉద్యోగుల దశలవారీ ఆందోళనలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని ఇపిడిసిఎల్ సర్కిల్ కార్యాలయం వద్ద బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను విద్యుత్ ఉద్యోగ సంఘాల జెఎసి జిల్లా చైర్మన్ ఎం.వి గోపాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఉద్యోగులకు నష్టదాయకమైన నిర్ణయాలతో సహనాన్ని పరీక్షిస్తోందన్నారు. సంస్థలో రెగ్యులర్ ఉద్యోగికి ఇస్తున్న వేతనాలను కాంట్రాక్టు కార్మికులకూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1999 నుంచి 2023 మధ్య విద్యుత్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు జిపిఎఫ్, పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డిఎలను తక్షణమే విడుదల చేయాలని, విద్యుత్ సర్వీసుల్లో జాప్యానికి లైన్‌మెన్లను, ఇతర ఉద్యోగులను బాధ్యులను చేస్తూ వేతనాల్లో కోతలు విధించడం తగదన్నారు. తక్షణమే ఉద్యోగులకు పిఆర్‌సిని ఇవ్వాలన్నారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ఇస్తున్న మాస్టరల్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు నగదు రహిత వైద్య సౌకర్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు బి.రమేష్ కుమార్, సనపల వెంకటరావు, బి.ఈశ్వరరావు, జి.సురేష్ కుమార్, సిహెచ్.వెంకటేశ్వరరావు, ఆర్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










