Aug 28,2023 21:59

ప్రజాశక్తి - ఏలూరు
        2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్‌ పోరాటాన్ని నేటి వైసిపి ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టిన గతి నేడు జగన్‌ ప్రభుత్వానికి పట్టకూడదంటే పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, ప్రజలపై వేస్తున్న భారాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లాకార్యదర్శి ఎ.రవి హెచ్చరించారు. స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సోమవారం విద్యుత్‌ అమర వీరుల వర్థంతి సభ ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్‌ అధ్యక్షతన జరిగింది. తొలుత విద్యుత్‌ అమరవీరుల చిత్రపటానికి ఎ.రవి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్‌ ఆదేశాల మేరకు చంద్రబాబు విద్యుత్‌ ఛార్జీలు పెంచడం, ఆ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షపార్టీలు, ఆనాటి కాంగ్రెస్‌, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున విద్యుత్‌ పోరాటం సాగిందని గుర్తుచేశారు. 2000 సంవత్సరం ఆగష్టు 28న అప్పటి సిఎం చంద్రబాబు కిరాతకంగా విద్యుత్‌ పోరాటం చేస్తున్నవారిపై పోలీసులతో కాల్పులు జరిపి బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌ రెడ్డిని బలిగొన్నాడన్నారు. అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నుండి విద్యుత్‌ పోరాటంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వెళ్లిన కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్‌ పోరాటం ఫలితంగానే చంద్రబాబు, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన వారు ఎవ్వరూ విద్యుత్‌ ఛార్జీలు పెంచే యోచనే చేయలేదన్నారు. చరిత్రక విద్యుత్‌ పోరాటంలో భాగస్వామిగా ఉన్న ఆనాటి కాంగ్రెస్‌ నాయకులు రాజశేఖర్‌రెడ్డి కుమారుడు ప్రస్తుత సిఎం జగన్‌ నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 విద్యుత్‌ సవరణల చట్టం ద్వారా ట్రూఅఫ్‌, సర్దుబాటు, సర్‌ ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలు, ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేర్లతో విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టి ఆ భారాన్ని కూడా ప్రజల నుండే వసూలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారని, మరోవైపు ఆర్‌టిసి ఛార్జీలు, పట్టణాల్లో ఆస్తి పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, ఎక్కడా లేని విధంగా చెత్తపై పన్ను వేసి ప్రజలను మరింత ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలందరూ ఈ భారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం ద్వారానే మోడీ షరతులు, జగన్‌ అమలుతీరు ఆగుతుందని లేకపోతే ప్రజలపై మరింతగా విద్యుత్‌ భారాలతోపాటు ఇతర భారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతాయని తెలిపారు. ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 30 నుండి వచ్చేనెల నాలుగో తేదీ వరకూ నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్‌, జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహారావు, కె.శ్రీనివాస్‌, ఇతర నాయకులు వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, శారద, త్రినాధ్‌, ఇస్సాక్‌, ఎం.సత్యం, మావూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఏలూరు అర్బన్‌ : పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించుకోకుంటే మరో విద్యుత్‌ ఉద్యమం తప్పదని వామపక్షాలు హెచ్చరించాయి. సోమవారం ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో బషీర్‌బాగ్‌ విద్యుత్‌ ఉద్యమంలో మృతి చెందిన ముగ్గురు అమరులకు వామపక్ష పార్టీలు నివాళులర్పించాయి. స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ వద్ద సిపిఐ ఏలూరు సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, సిపిఎం ఏలూరు కార్యదర్శి పి.కిషోర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, బండి వెంకటేశ్వరరావు, కొంపల్లి కృష్ణమాచార్యులు, సిపిఎం నాయకులు బి.సోమయ్య, వి.సాయిబాబు, జగన్నాధరావు, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల బద్దా వెంకట్రావు, గడసాల రాంబాబు పాల్గొన్నారు.
నిడమర్రు: విద్యుత్‌ పోరాట అమరులకు సిపిఎం నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనపల్లి రావిచెట్టు సెంటర్‌లో విద్యుత్‌ పోరాట అమరుల సంతాప సభ కోన శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ నారపల్లి రమణారావు, నాయకులు గవర సత్యనారాయణ. వెలగలేటి మోహన్‌, పి.సూరిబాబు, వెంకటేష్‌, నరేష్‌, రంగారావు, మనీష పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకపోతే జగన్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వాపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. సోమవారం విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభ ధర్మన్న స్మారక భవనంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో జరిగింది. చల్లారి మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐఎం ఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు రమణ, సిపిఐ మండల కార్యదర్శి జెవి.రమణరాజు, సిపిఎం పట్టణ కన్వీనర్‌ పసల సూర్యారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వి.సత్యనారాయణ, సిపిఐ నాయకులు బి.బాలరాజు, కుంచె వసంతరావు, జి.బాలఏసు, తమ్మా సోమలింగ మల్లికార్జునరావు, కె రామలక్ష్మి పాల్గొన్నారు.