Aug 28,2021 06:13

డిస్కాంల ప్రైవేటీకరణ లేదా ఫ్రాంచైజీలకు అప్పగించాలంటే ప్రభుత్వం వారికి లాభం గ్యారంటీ చేయాలి. విద్యుత్‌ బిల్లింగ్‌, వసూలు అందుకు కీలకం. ఈ రెండూ పూర్తి స్థాయిలో జరగడానికి అన్ని కనెక్షన్లకూ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాలన్నది సర్కారు వ్యూహం. విద్యుత్‌ వినియోగం ఎంతయిందన్నది తెలుసుకోవడానికి కనెక్షన్‌ వద్దకు రానక్కర్లేదు సరి కదా వారు చెల్లించిన డబ్బుకు సరిపడా కరెంటు వాడేస్తే మరుక్షణమే సరఫరా నిలిచిపోతుంది. మీటర్‌ రీడర్‌, బిల్లు కలెక్టర్‌ అవసరం లేదు. పైపెచ్చు సొమ్ము ముందుగానే డిస్కాము ఖజానాకు చేరుతుంది.
     సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ల క్రితం విద్యుత్‌ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ పోలీసు కాల్పుల్లో ముగ్గురు యువకులు బలి దానం చేశారు. పదుల సంఖ్యలో కార్యకర్తలు తుపాకీ తూటాల వల్ల గాయపడగా వందలాదిమంది లాఠీ దెబ్బలకు గురయ్యారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నవారిపై తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఘాతుకానికి పాల్పడింది. ఈనాటికీ తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగదారులకు కింది శ్లాబుల్లో విద్యుత్‌ చార్జీల పెంపు దాదాపు లేకపోవడం, లేదా స్వల్పంగా ఉండడానికి ఆనాటి మహోద్యమం, అమర వీరుల త్యాగమే కారణం.

డిస్కాములపై కన్ను
    తొంభయ్యవ దశకంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ప్రారంభమైన సంస్కరణల అమలుతో కేరళ మినహా అన్ని రాష్ట్రాల విద్యుత్‌ బోర్డులు ఉత్పత్తి (జెన్‌కో), ప్రసారం (ట్రాన్స్‌కో) పంపిణీ (డిస్కాం) మూడు ముక్కలయ్యాయి. విద్యుదుత్పత్తిలో ప్రైవేటురంగం పాగా వేసింది. గడచిన మార్చి 31 నాటికి దేశంలో ఉత్పత్తయిన విద్యుత్‌లో 47 శాతం ప్రైవేటు రంగానిదే కావడం గమనార్హం. ప్రసార రంగంలో ప్రత్యక్ష లాభాలకు అవకాశాలు తక్కువగా వుండడం, భారీ పెట్టుబడి, విధాన నియంత్రణ అవసరం కనుక మినీ గ్రిడ్లు తప్ప దాదాపు ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతోంది. పంపిణీ రంగ ప్రైవేటీకరణకు గత పదేళ్లుగా ప్రభుత్వాలు యత్నిస్తున్నా వ్యతిరేకత మూలంగా ముందుకు సాగలేకపోయాయి. అయితే, నరేంద్ర మోడీ రెండవసారి అధికారానికి వచ్చాక విద్యుత్‌ సంస్కరణలు అందునా డిస్కాం ప్రైవేటీకరణ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
     మొట్టమొదట 1999 లోనే ఒడిషాలో నాలుగు డిస్కాంలను ప్రైవేటీకరించారు కానీ తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. ఒక కంపెనీ మూటా ముల్లె సర్దుకొని పోగా మిగతా మూడింటి లైసెన్సులను ఆ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌ రద్దు చేసింది. అయితే, ప్రధానంగా నగరాలు, పట్టణ జనాభా ఉన్న చోట కొన్ని డిస్కాముల్లో ప్రైవేటీకరణ లేదా ఫ్రాంచైజీ పద్ధతి అమలు లోకి వచ్చింది. ముంబయి, ఢిల్లీ, సూరత్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా వంటి కొద్ది చోట్ల అవి లాభాల్లో ఉన్నాయి. అయితే పరిధి పరిమిత ప్రాంతంలో ఉండడం, మెరుగైన ఆర్థిక స్తోమతగల నగరవాసులు వినియోగదార్లు కావడం, ముంబయిలో భూగర్భ లైన్లు వుండడంవల్ల నిర్వహణా ఖర్చు తక్కువ కావడం, అన్నిటికీ మించి వాటికి ప్రభుత్వం నుండి సబ్సిడీలు, ఇతర రాయితీలవల్ల అది సాధ్యమవుతోందని నిపుణులు నిర్ధారించారు. దేశం మొత్తంగా చూస్తే ఇప్పుడు పది శాతం మంది వినియోగదార్లు ప్రైవేటు డిస్కాం లేదా ఫ్రాంచైజీల నుండి సేవలు పొందుతున్నారు. దాన్ని విస్తరించడానికి, డిస్కాముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోడీ సర్కారు సర్వవిధాలా యత్నిస్తోంది. విద్యుత్‌ సంస్కరణల కొనసాగింపుపై అమెరికాకు చెందిన రాకీ మౌంటెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఎంఐ) నిపుణులు రూపొందించిన 'టర్నింగ్‌ ఎరౌండ్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టర్‌' అన్న నివేదికను నీతి ఆయోగ్‌ ఆగస్టు 2న ప్రచురించింది. భారత ప్రభుత్వానికి విద్యుత్‌ సంస్కరణల దశ, దిశను సూచించేది అదే !

కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు
విద్యుత్‌ చట్టం (2003)ను సవరించాలని యుపిఎ-2 హయాంలో 2013 లోనే ప్రయత్నం మొదలైంది. కాని అది నెరవేరలేదు. మోడీ గద్దెనెక్కాక 2018లో ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందుగా సవరణలను ప్రతిపాదించినా అవి ఆచరణకు రాలేదు. దాంతో చట్టానికి కాకుండా రూల్స్‌కు సవరణలు తేవడానికి కొన్ని పాలనాపరమైన ఉత్తర్వులిచ్చింది. గత తొమ్మిది నెలలుగా సాగుతున్న చారిత్రాత్మక రైతు ఉద్యమ డిమాండ్లలో మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుతోపాటు విద్యుత్‌ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలన్నదీ ప్రధానమైనది. దేశమంతటా రైతు ఆందోళన సాగుతుంటే మరోవైపున చట్ట సవరణ అంశాలను మోడీ సర్కారు దొడ్డిదారిన తీసుకొస్తోంది.
    అన్నిటికన్నా మించి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా అప్పు చేసుకోవడానికి ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు సడలిస్తామని, అందుకు విద్యుత్‌ సంస్కరణలు చేపట్టాలని షరతులు విధిస్తోంది. వాటికి లొంగిన వైసిపి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదే వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగింపునకు నిర్ణయించిన విషయం విదితమే! గత ఫిబ్రవరి 17న రాష్ట్రాల విద్యుత్‌ శాఖ కార్యదర్శులతో కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్‌ విద్యుత్‌ సవరణ బిల్లులోని కొన్ని అంశాలు ప్రతిపాదించగా అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అయినా ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తాము చెప్పిన సంస్కరణల్ని అమలు చేసిన డిస్కాములకు అదనంగా నిధులు, రుణాలు కేటాయిస్తామని ఈ ఏడాది జూలై 20న 'రీ వ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌' పేరిట 20 పేజీల లేఖల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఏ గడువు లోగా స్మార్ట్‌ మీటర్లు పెట్టాలి, నగదు బదిలీ చేయాలి, వ్యవసాయంతో సహా రాయితీలను తొలగించాలి వంటివాటితోపాటు విద్యుత్‌ పోలీసులను నియమించాలని కూడా ఈ ప్రతిపాదనల్లో వుంది.
 

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు కోసం...
డిస్కాంల ప్రైవేటీకరణ లేదా ఫ్రాంచైజీలకు అప్పగించాలంటే ప్రభుత్వం వారికి లాభం గ్యారంటీ చేయాలి. విద్యుత్‌ బిల్లింగ్‌, వసూలు అందుకు కీలకం. ఈ రెండూ పూర్తి స్థాయిలో జరగడానికి అన్ని కనెక్షన్లకూ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాలన్నది సర్కారు వ్యూహం. విద్యుత్‌ వినియోగం ఎంతయిందన్నది తెలుసుకోవడానికి కనెక్షన్‌ వద్దకు రానక్కర్లేదు సరి కదా వారు చెల్లించిన డబ్బుకు సరిపడా కరెంటు వాడేస్తే మరుక్షణమే సరఫరా నిలిచిపోతుంది. మీటర్‌ రీడర్‌, బిల్లు కలెక్టర్‌ అవసరం లేదు. పైపెచ్చు సొమ్ము ముందుగానే డిస్కాము ఖజానాకు చేరుతుంది. దేశమంతటా 25 కోట్ల స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు కావాలి. అది పని చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ కూడా కావాలి. వీటి తయారీ, నిర్వహణ రిలయన్స్‌ వంటి కంపెనీలు, విదేశీ కార్పొరేట్లు చేస్తాయి. కనుక వారికి మార్కెట్‌ కల్పించడంతోపాటు ప్రైవేటు డిస్కాములకు ఆదాయం సమకూర్చడం అన్న రెండు ప్రయోజనాల్ని సంపన్నులకు కేంద్రం నెరవేరుస్తుందన్నమాట. అయితే, ఇది అంత తేలికగా అయిపోయేది కాదు. ఇప్పటి వరకు దేశమంతటా 15,79,052 స్మార్ట్‌ మీటర్లు బిగించారు. అంటే ఇది ఒక్క శాతం కూడా కాదు.
 

ప్రపంచ అనుభవం ఏమిటి ?
ప్రపంచమంతటాగల డిస్కాముల్లో 70 శాతం ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. ప్రైవేటు రంగంలోని ఆ 30 శాతం డిస్కాములు ప్రధానంగా మధ్య, అధికాదాయ దేశాల్లోనివే. మనది వర్ధమాన దేశమే కదా! ఇదిలా వుండగా జర్మనీ, అమెరికాల్లోని మునిసిపాల్టీల్లో ప్రజలు ప్రైవేటు డిస్కాములు వద్దనీ, స్థానిక సంస్థలే నిర్వహించాలని కోరుతున్నారు. జర్మనీలో 1990లో ప్రైవేటీకరించగా ఇరవై ఏళ్ల గడువు ముగిసిన తరువాత ఇటీవల ప్రైవేటు వారి లైసెన్సులు పునరుద్ధరించరాదని స్థానిక ప్రజలు రీ నేషనలైజేషన్‌ సాధించుకుంటున్నారు. బ్రిటన్‌ లోనూ రైల్వే, పోస్టల్‌, విద్యుత్‌ తదితర పౌర సేవల విషయంలో ఇటువంటి ఉద్యమాలు జరిగిన విషయం విదితమే! దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా వెనుకబడిన ప్రాంతాలైన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, విజయనగరం జిల్లా చీపురుపల్లి, చిత్తూరు జిల్లా కుప్పం కేంద్రాలుగా పని చేస్తున్న గ్రామీణ విద్యుత్‌ సహకార సొసైటీ (ఆర్‌ఇసిఎస్‌)లను ఆయా డిస్కాముల్లో విలీనం చేశారు. అమెరికాలో 930 గ్రామీణ సహకార సంఘాలుండగా వాటిలో 864 విద్యుత్‌ పంపిణీ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 47 రాష్ట్రాల్లోని 4 కోట్ల 20 లక్షల మందికి సేవలందిస్తున్నాయి. మరి అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలను చూసైనా మన పాలకులు పాఠాలు నేర్చుతారా !
 

రేటింగ్‌ మాయాజాలం
డిస్కాముల పని తీరును అంచనా వేయడానికని చెప్పి కేంద్ర విద్యుత్‌ శాఖ డిస్కాములకు రేటింగ్‌ నిర్ణయిస్తోంది. రేటింగ్‌ సంస్థలు ఇక్రా, కేర్‌ మదింపులను అధీకృతం చేస్తోంది. 2012 జులై నుండి ఏటా రూపొందిస్తున్న ఈ రేటింగ్‌కు సంబంధించిన తాజా నివేదిక ఇటీవల విడుదలయింది. దేశంలోని 48 డిస్కాములను ఎ+, ఎ, బి+, బి, సి+, సి అనే ఆరు కేటగిరీలుగా వర్గీకరించింది. ఇందులో అత్యున్నత కేటగిరీ ఎ+ లోని ఐదు డిస్కాములూ బిజెపి పాలిత రాష్ట్రాలవే! మొదటి నాలుగు గుజరాత్‌వి కాగా మరొకటి హర్యానాది. అట్టడుగు సి కేటగిరీ లోని ఎనిమిది డిస్కాములలో మూడు ఈశాన్య రాష్ట్రాలవి పోనూ మిగతా ఐదూ బిజెపి యేతర పార్టీలు అధికారంలోవున్న రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, జార్ఖండ్‌ రాష్ట్రాలవే కావడం గమనార్హం. దేశంలో ఎంతో పేరుగాంచిన ఎపిఇపిడిసిఎల్‌ ను సి కేటగిరీలో పెట్టడం ఆశ్చర్యకరం. విద్యుత్‌ పంపిణీ సంస్థ పని తీరుకు కీలకమైన కొలబద్ద సాంకేతిక, వాణిజ్య నష్టం (యాగ్రిగేట్‌ టెక్నికల్‌ అండ్‌ కమర్షియల్‌ లాస్‌). విశాఖ కేంద్రంగా గల ఎపిఇపిడిసిఎల్‌ పని తీరుకు గత రెండు దశాబ్దాల్లో ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కాయి. ఈ నివేదిక ప్రకారం కూడా ఎపిఇపిడిసిఎల్‌కు ఎ.టి డ సి లాస్‌ 6.64 శాతం వుండగా గుజరాత్‌ నాలుగు డిస్కాములకు వరుసగా 6.22, 6.88, 11.31, 19.21 శాతం ఉన్నాయి. మరి వాటికెందుకు ఎ+, ఆంధ్రా డిస్కాంకు సి కేటగిరీలో పెట్టారంటే గుజరాత్‌ ఆడిటింగ్‌ పూర్తయిందని, రెగ్యులేటరీ ఎసెట్‌ లేదనీ చెబుతున్నారు. ఆంధ్రాలో సబ్సిడీ సొమ్ము ఇంకా పూర్తిగా రాకపోవడం డిస్కాం నేరమట! ఇలాంటి రేటింగ్‌ నిష్పక్షపాతం అని ఎలా అనుకోగలం?
 

ఏది మార్గం !
'భారత విద్యుత్‌ రంగం ప్రపంచంలోని అతి పెద్ద వాటిలో ఒకటి. అత్యంత సంక్లిష్టమైనది కూడా' అని ఆర్‌ఎంఐ నివేదిక పేర్కొంది. 'ఈ దేశం చాలా విశాలమైనది, వైవిధ్యంతో కూడుకున్నది కనుక సంస్కరణలకు ఒకే నమూనా పనికిరాదని చారిత్రకంగా గుణపాఠం వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ సంకల్పం దన్నుతో వెసులుబాట్లతో కూడిన స్థానిక నమూనాలను అమలు చేస్తే విజయం సాధించగలం' అన్నది నివేదిక చివరి వాక్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ సంకల్పంతో విద్యుత్‌ సంస్కరణల్ని అమలు చేస్తాయి కనుక వాటివల్ల నష్టపోయే విద్యుత్‌ వినియోగదార్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు, ప్రజలంతా ఐక్యంగా ప్రతిఘటించాలి. డిస్కాముల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. అదే పోలీసుల తూటాలకు బలైపోయిన రామకృష్ణ, విష్ణువర్ధన్‌, బాలాస్వామిలకు నిజమైన నివాళి.

బి. తులసీదాస్‌