ప్రజాశక్తి-యంత్రాంగం విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్ధమవ్వాలని పలువురు వామపక్షాల నాయకులు పిలుపు ఇచ్చారు. సోమవారం అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ సుందరయ్య భవన్‌లో విద్యుత్ అమర వీరులు సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలాస్వామి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో సిపిఎం సీనియర్ నాయకులు దువ్వా శేషబాబ్జి, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జి.ఆదినారాయణ, ఆర్‌పిఐ రాష్ట్ర నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు మాట్లాడారు. 2000లో దేశ చరిత్రలో నిలిచిపోయిన విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రజా పోరాటం సాగిందని తెలిపారు. ఆగస్టు 28న బషీరాబాగ్ ప్రజా మహా ప్రదర్శనలో చంద్రబాబు ప్రభుత్వం సాగించిన దమనకాండలో ముగ్గురు అమరులయ్యారని చెప్పారు. నాటి ఉద్యమ ఫలితంగా పాలకులు అనేక సంవత్సరాలు పాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సాహసం చేయలేదన్నారు. ఆ మేరకు ప్రజలకి న్యాయం జరిగిందని, విద్యుత్ ప్రయివేటీకరణ దూకుడు తగ్గిందని గుర్తు చేశారు. ఇప్పుడు మరలా జగన్ ప్రభుత్వం గత పాఠాలు మరిచిపోయి విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రయివేటీకరణ వేగం పెంచిందన్నారు. జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ద్యమాలు చేపడతామని ప్రతినబూనారు. ప్రజలపై భారాలు వేసి పాలన సాగిస్తామంటే ఎర్ర జెండా పార్టీలు ఊరుకోవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు ప్రసన్న, సిపిఎం నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిహెచ్.రమణి, సిహెచ్.అజరు కుమార్, కె.వీరబాబు, కె.సింహాచలం, పి.వీరబాబు, పి.రామకష్ణ, సిహెచ్.విజరుకుమార్, టి.రాజా, ఎం.వి.రమణ, మలకా రమణ, ఎం.సూరిబాబు, కృష్ణాజీ, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని నండూరి ప్రసాదరావు భవనంలో సిపిఎం నాయకులు విద్యుత్ పోరాట అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి ప్రాణ త్యాగాలతో ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే భయపడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో రాబోయే రోజుల్లో రైతులకు ప్రజలకు చాలా తీవ్రమైన అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు నిర్ణయాలు చేస్తోందన్నారు. నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈనెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ నాలుగోవ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.చిన్న, కోనేటి రాజు, విశ్వనాథం, నాగేశ్వరరావు, మణి, వీరబాబు, భాస్కర్, ఎస్.శ్రీను, ఎస్.రాజేష్, సూర్యనారాయణ, పి.చిరంజీవి, నందీశ్వరుడు, ఎ.రాజు పాల్గొన్నారు. పెద్దాపురం విద్యుత్ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఉద్యమాల బాటలో ముందుకు సాగాలని సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అన్నారు. స్థానిక నువ్వుల గుంట వీధిలోని భగత్ సింగ్ సెంటర్లో విద్యుత్ అమరవీరుల సంతాప సభలో ఆయన ప్రసంగించారు. తొలుత అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరపరపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సిపిఎం నాయకులు గడిగట్ల సత్తిబాబు, నెక్కల నరసింహమూర్తి, ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు చింతల సత్యనారాయణ, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తైనాల శ్రీను, నీలం శ్రీను, గడపా వీరబాబు, కేదారి నాగు, పాపేశ్వరావు, క్రాంతి కుమార్, రొంగల సుబ్బలక్ష్మి, దారపు రెడ్డి సత్యవతి ప్రసంగించారు. ఈ సభలో ప్రజానాట్యమండలి కళాకారులు రొంగల వీర్రాజు, దారపురెడ్డి కృష్ణ, మహాపాతిన రాంబాబు ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలను ఆలపించారు.










