Apr 18,2023 23:30

నినాదాలు చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి- పరవాడ
మండలంలోని కలపాక పంచాయతీ పరిధి మూల స్వయంవరం గ్రామంలో విద్యుత్‌, తాగునీరు నిరంతరం సరఫరా చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్షులు పి.మాణిక్యం డిమాండ్‌ చేశారు. మంగళవారం గ్రామంలో పర్యటించిన ఆమె ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజులుగా విద్యుత్‌, తాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ ఒకపక్క ఎన్టీపీసీ బొగ్గు, ఇంకో పక్క నీటి కొరత, కరెంటు కోతతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, ఎన్టీపీసీ సింహాద్రి అధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.మహాలక్ష్మి, కె.లక్ష్మి, కె.నూకరత్నం, కె.సాయి, వై.కుమారి, వరలక్ష్మి, కె.మహాలక్ష్మి, ఎం.లీల తదితరులు పాల్గొన్నారు.