Jun 20,2023 00:36

మాట్లాడుతున్న నళినీకాంత్‌

ప్రజాశక్తి-గుంటూరు : అప్రకటిత విద్యుత్‌ కోతలు, విద్యుత్‌ బిల్లు పెంపుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అర్ధరాత్రుల్లో సైతం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని సిపియం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ విమర్శించారు. ముందుచూపులేని ప్రభుత్వం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సోమవారం బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నళినికాంత్‌ మాట్లాడుతూ గత రెండు, మూడేళ్ళుగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అస్థవ్యస్థం చేసిందని, దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న లైన్‌ మెన్లు ఇతర విద్యుత్‌ సిబ్బంది అప్పటికప్పుడు కష్టపడి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నిష్ప్రయోజనం అవుతున్నాయన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా కొత్త ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడం, సామర్థ్యాన్ని పెంచకపోవడం, విద్యుత్‌ సరఫరా లైన్ల సామర్థ్యాన్ని పెంచి ఆధునీకరించకపోవడం వల్లే ఈపరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి తోడు ఎండాకాలంలో విద్యుత్‌ సిబ్బందిని ట్రాన్స్ఫార్మర్ల మరమత్తులు, విద్యుత్‌ సరఫరా లైన్లు నిర్వహణ లాంటి పనులకు కాకుండా డిఫాల్టర్ల 2010 ముందు బకాయిలు వసూళ్లకు వినియోగిస్తున్నారని దీంతో సరఫరాలో వచ్చే ఇబ్బందులను సమర్థవంతంగా అరికట్టలేకపోతున్నారని తెలిపారు. అత్యవసర రోజుల్లో అధిక రేట్లకు విద్యుత్‌ కొంటున్నా, సరఫరా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఆ ప్రయోజనాన్ని ప్రజలు పొందలేకపోతున్నారని మరోవైపు అదనంగా ఖర్చయిందని సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్‌ బిల్లుల భారాన్ని ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతుందని విమర్శించారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం సర్దుబాటు చార్జీలు, ఇంధన చార్జీలు అంటూ రకరకాల పేర్లతో వాడిన దానికంటే ఎక్కువగా విద్యుత్‌ బిల్లు వేస్తున్నదని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో భవిష్యత్తులో రూ.10 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసేందుకు వైసిపి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు షేక్‌ ఖాశిం షహీద్‌ పాల్గొన్నారు.