
ప్రజాశక్తి-చోడవరం
వ్యవసాయ మోటార్లకు నెలరోజుల నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోయాయని అంకుపాలెం గ్రామానికి చెందిన రైతులు విద్యుత్‌శాఖ ఏడి కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో దానిని పునరుద్ధరించడానికి విద్యుత్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వీరికి మండలంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నాగులపల్లి రాంబాబు, గౌరీపట్నం సర్పంచ్ కోన చందర్రావు, శ్రీరామపట్నం సర్పంచ్ వెంకటరమణ, జన్నవరం సర్పంచ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చోడవరం మండల విద్యుత్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తుందన్నారు. ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. మండల సమావేశంలో వీరి అవినీతిపై విచారణ జరపాలని తీర్మానించామని గుర్తు చేశారు. తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కోలా పద్మావతి, దేవుడు, రాకోటి సత్తిబాబు, ముగ్గిన గోవింద, రైతులు పాల్గొన్నారు.