Oct 19,2023 20:57

సదస్సులో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  విద్యుత్‌ సంస్కరణలతో కేవలం వినియోగదారులకే కాకుండా సగటు మనిషికి నష్టం వాటిల్లుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పంపుసెట్లకు వర్తింపజేస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసే ప్రమాదం ఉందని అన్నారు. ప్రైవేటీకరణలో భాగంగా ఇప్పటికే విశాఖలోని ఎన్‌టిపిసి తదితర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను ప్రైవేటీపరం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసిందన్నారు. ఈనేపథ్యంలో ప్రజలంతా సంఘటితమై విద్యుత్‌ రంగం సంస్కరణలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షతన 'విద్యుత్‌ సంస్కరణలు - ప్రజలపై భారాలు' అనే అంశంపై కెఎల్‌పురంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో గురువారం సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర సదస్సులో వీరు ప్రసంగించారు. తొలుత తులసీదాస్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, విశాఖ రైల్వే జోన్‌ సహా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. తాజాగా స్టీల్‌ప్లాంట్‌ సహా పోర్టులు, ఎయిర్‌పోర్టులు ప్రైవేటుపరం చేస్తోందని విమర్శించారు. ఇది చాలదన్నట్టు ట్రూఅప్‌, సర్థుబాటు ఛార్జీల పేరిట అదనంగా భారాలు మోపుతోందన్నారు. సోలార్‌, పవన్‌ విద్యుత్‌తో రూ.1కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేయవచ్చని, భవిష్యత్తులో తమ పార్టీ ఆధ్వర్యాన ఈ విధమైన ప్రయోగం చేసి చూపిస్తామని సవాలు చేశారు. విద్యుత్‌ ప్రైవేటీకరణ వల్ల గృహ వినియోగదారులతోపాటు వ్యాపారులు, పరిశ్రమల మనుగడ కష్టతరంగా మారుతోందన్నారు. ఫలితంగా ఉన్న ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కరణల్లో భాగంగా స్మార్ట్‌మీటర్లు, ప్రీపెయిడ్‌ విధానం అమలు చేస్తే విద్యుత్‌ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న మీటర్‌ రీడింగ్‌ తదితర ఉద్యోగులు తొలగింపునకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, కొత్తగా ఆ రంగంలో ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు లేవని అన్నారు. ఇప్పటికే అవలంభించిన విధానం ఉత్పత్తి సంస్థల్లో వల్ల పెట్టుబడిదారుల హవా పెరిగిందని, ఇప్పుడు ట్రాన్స్‌మిషన్‌, పంపిణీ విభాగాల్లో కూడా అడుగుపెట్టేందుకు ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని వివరించారు. మోసపూరితమైన ఈ విద్యుత్‌ సంస్కరణలపై రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన వైఖరి బిజెపికి అనుకూలంగానే ఉందన్నారు. ఇలాంటి మోసకారి విధానాల వల్ల ఇప్పటి వరకు వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం మాత్రమే పోరాడాయని, తాజాగా ముందుకు వచ్చిన విద్యుత్‌ సంస్కరణలపైనా రాజీలేని పోరాటం చేస్తామని, ఆ తరువాత ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్త్తుందని అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఆధోని, శ్రీకాకుళం జిల్లా మందస, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట నుంచి మూడు బస్సు యాత్రలు ఈనెల 30, వచ్చేనెల 2న ప్రారంభమై నవంబర్‌ 15నాటికి విజయవాడ చేరుతాయని అన్నారు. ఆరోజు జరగబోయే బహిరంగ సభకు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు హాజరు కానున్నారని వివరించారు. ఆ బహిరంగ సభకు జనం తరలిరావాలని పిలుపునిచ్చారు.
సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ విద్యుత్‌ భారాల వల్ల జిల్లాలోని ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు చాలా వరకు మూతపడ్డాయని, ఫలితంగా అందులో పనిచేస్తున్న ఉద్యోగులు జీవనోపాధి కోల్పోయారని అన్నారు. ఒడిశా, జార్ఖాండ్‌ రాష్ట్రాల్లో పరిశ్రమలకు యూనిట్‌ రూ.3కు సరఫరా చేస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం రూ.8.50వసూలు చేస్తున్నారని తెలిపారు. రూ.7,300 కోట్ల అప్పుకు కక్కుర్తిపడ్డ సిఎం జగన్మోహన్‌రెడ్డి మోడీ మోసపూరిత విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌ సంస్కరణల బిల్లును పార్లమెంట్‌లో పెట్టేందుకు సాహశించని మోడీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో కూడా నెగ్గే పరిస్థితి లేదన్నారు. అందుకనుగుణంగా పోరాడేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

 సదస్సులో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ
సదస్సులో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ చెప్పిందల్లా చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. సభాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాతూ విద్యుత్‌ భారాలు మోపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చంద్రబాబు మాదిరిగా గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉందని, అందుకనుగుణంగా ప్రజల్ని చైతన్యపరుస్తామని అన్నారు. విద్యుత్‌ సంస్కరణలపై సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా రాజీలేని పోరాటం చేసేందుకు సదస్సు ఏకగ్రీవంగా తీర్మాణించింది. సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి, టివి రమణ, పి.శంకరావు, రెడ్డి శంకర్రావు పాల్గొన్నారు.