Jun 19,2023 21:16

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

- సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యుత్‌ సంస్కరణల వల్ల పేదలపై పెను భారం పడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఎన్‌జిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల ఒకటి నుంచి వస్తున్న బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారని, ఎండ తీవ్రతను తట్టుకోలేక విద్యుత్‌ ఎక్కువ వినియోగించుకున్నారని అందుకే బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ప్రభుత్వం ప్రజలను మభ్యపరుస్తున్నదని తెలిపారు. వైసిపి ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులతో ప్రజల నడ్డి విరుస్తోందని వాపోయారు. ఒకేసారి మూడు రకాల ట్రూ అప్‌, సర్దుబాటు ఛార్జీల భారాన్ని ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపిందదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వినియోగించుకున్న విద్యుత్‌కు బిల్లులు కట్టినప్పటికీ, ప్రభుత్వం లోటు చూపిస్తూ, గతంలో వాడుకున్న విద్యుత్‌పై సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు వినియోగించుకున్న విద్యుత్‌కు ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో రూ.2900 కోట్లు భారం మోపారని అన్నారు. ఇప్పటికే 11 నెలలు సంబంధించి నెలకు యూనిట్‌కి 20 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారని, మరో 25 నెలల పాటు ఇది కొనసాగనుందని తెలిపారు. ప్రస్తుతం వాడుకున్న విద్యుత్‌కు మాత్రమే కాకుండా, గతంలో వాడుకున్న విద్యుత్‌కు మూడు రకాలుగా యూనిట్‌కు 80 పైసలు చొప్పున వసూలు చేయటం దారుణమని అన్నారు. సుమారు రూ 6 వేల కోట్లు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రత్యక్షంగా భారం మోపిందని తెలిపారు. గత సంవత్సరం ఛార్జీలు పెంచారని, శ్లాబులు మార్చి రూ.1500 కోట్లు భారం పడిందని, అది ఈ సంవత్సరం కూడా కొనసాగుతోందని అన్నారు. ఫిక్స్డ్‌ చార్జీలు, కస్టమర్‌, సర్‌ ఛార్జీలు, విద్యుత్‌ సుంకం పేరుతో కళ్ళకి కనపడకుండా మరిన్ని భారాలు ప్రజలపై మోపారని వాపోయారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ తెచ్చిన విద్యుత్‌ సంస్కరణను తూచా తప్పక అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీల జేబులు నింపుతోందని తెలిపారు. బొగ్గు, ఇంధనం పేరుతో ఆదానీ తదితర కంపెనీలు కోట్లు కొల్లగొట్టాయని, ఆ భారం ఇప్పుడు ప్రజలపై మోపుతున్నారని అన్నారు. ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు విమర్శించడమే తప్ప, విధానాల విషయంలో సంస్కరణల ప్రమాదాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం, వామపక్షాలు మాత్రమే విద్యుత్తు నియంత్రణ మండలి సమావేశాలలో సర్దుబాటు చార్జీలపై నికరంగా పోరాడుతున్నాయని వివరించారు. విద్యుత్‌ రంగంలో ప్రత్యామ్నాయ విధానాలు కావాలని, ప్రయివేటీకరణ విధానలు పోవాలని పేర్కొన్నారు. తక్షణమే అన్ని రకాల ట్రూ అప్‌, సర్దుబాటు ఛార్జీలు రద్దుచేసి ప్రభుత్వమే భరించాలని, సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేయాలని, ప్రయివేటీకరణ విడనాడి ప్రభుత్వ రంగంలో విద్యుత్‌ కొనసాగాలని, విద్యుత్‌ కొనుగోలులో అవినీతి అరికట్టాలని, బడా కార్పొరేట్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకావాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం విద్యుత్‌ ఛార్జీలభారం పైన, ప్రమాదకర విధానాల పైన పోరాటం కొనసాగిస్తుందని, ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.రవికుమార్‌ పాల్గొన్నారు.