అనంతపురం కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలను ఐక్యంగా వ్యతిరేకించి, పెంచిన ఛార్జీలు ఉప సంహరించుకునేంత వరకు ఐక్యంగా ఉద్యమిద్దామని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్కరణలు, ప్రజలపై పడుతున్న భారాలను తెలియజేసేందుకు వామపక్ష పార్టీలు చేపట్టిన ప్రచార పోరాటం బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. రైల్వే స్టేషన్ నుంచి నిర్వహించిన ప్రచార కార్యక్రమాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ హాజరై ప్రారంభించారు. రైల్వే స్టేషన్ నుంచి రామచంద్రనగర్ చంద్రా హాస్పిటల్, ఆర్‌టిసి బస్టాండ్, కేర్,క్యూర్ ఆసుపత్రి వరకు నిర్వహించారు. సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వీధిసభలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్‌ఛార్జీలు, ట్రూఅప్, అదనపు ఛార్జీలతో విద్యుత్ భారాలను మోపుతూ ప్రజల నడ్డిని విరుస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తూచతప్పకుండా అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచే చర్యలు ప్రభుత్వం అనుసరించడం దుర్మార్గంగా ఉందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీధి సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వీరనారప్ప, సిపిఎం జిల్లా నాయకులు వై.వెంకటనారాయణ, ముస్కిన్, నగర నాయకులు వలీ, ప్రకాష్, ఎన్టీఆర్ శీన, లక్ష్మీనారాయణ, వరలక్ష్మి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, అల్లీపీరా, మునాఫ్, జయలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, నగర కార్యదర్శి శివ, సిపిఎం నాయకులు నిజాం, శివ, షరీఫ్, మోహన్, పీరా, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.










