
సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి - పెనుమంట్ర
విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన భారాలను మోపుతూ దోపిడికి పాల్పడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం విమర్శించారు. మార్టేరు దేవాంగ కళ్యాణ మండపంలో ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, పోడూరు ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్‌విఎన్.శర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్, సెస్, సర్ధుబాటు ఛార్జీల పేర్లతో పెద్దఎత్తున విద్యుత్ భారాలను ప్రజలపై మోపుతుందన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.400 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఒకేసారి ప్రజలకు భారం కాకుండా కొన్ని నెలల విరామం ఇచ్చి సర్దుబాటు ఛార్జీల పేరుతో భారాలు మోపి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని మోటార్లకు మీటర్లు బిగించి భారాలు మోపడానికి కుట్ర చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తున్నవారిని జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సిపియం జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని బలరాం తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్ మాట్లాడుతూ ఖరీఫ్ పంట మరికొన్నిరోజుల్లో కోతకు రానుందని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్‌బికెలకు సమకూర్చేలా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర, పెనుగొండ, పోడూరు మండలాల కార్యదర్శులు కూసంపూడి సుబ్బరాజు, సూర్నీడి వెంకటేశ్వరరావు, పిల్లి ప్రసాద్, నాయకులు వద్దిపర్తి అంజిబాబు, పి.మోహనరావు, కేతా పద్మజ, నేదూరి హనుమంతరావు, రాపాక ఆశీర్వాదం, షేక్ పాదుషా, బొంతు శ్రీను, నీలాపు ఆదినారాయణ పాల్గొన్నారు.