Aug 18,2023 21:05

నీరు లేక వాడిపోయిన మొక్కజొన్న పంట

ప్రజాశక్తి - పరిగి : విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు వినతులతో వేడుకున్నా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. వడ్డీలకు తెచ్చి కరెంటు కోసం లక్షల ఖర్చు చేసి కరెంటు స్తంభాల నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ మరమ్మతుల విషయంలో సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. మండల పరిధిలోని సర్వే నెంబరు 441,42,43 లలో సుమారు 50 ఎకరాలలో మిరప, మొక్కజొన్న, మల్బరీ పంటలను సాగు చేస్తున్నామన్నారు. మూడు నెలల క్రితమే ఈ ప్రాంతంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ హై వోల్టేజీతో కాలిపోయిందని చెప్పారు. అప్పటినుండి ఇప్పటివరకు పలుమార్లు అధికారులకు వినతులు అందించినా, చివరికి ఎమ్మెల్యేతో ఫోన్‌ ద్వారా చెప్పించినా పట్టించుకోలేదని పరిగి, శ్రీరంగరాజు పల్లి, పాపిరెడ్డిపల్లికి చెందిన రవీంద్ర రెడ్డి, ఆదినారాయణ, ప్రభాకర్‌, సివలింగగౌడ్‌, వెంకటేశ్‌, నాగరాజు, శ్రీనివాసులు, గోవిందప్ప వాపోయారు. ఇప్పటికే పంట సాగు మధ్యస్థితిలో ఉందనిఈ సమయంలో పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోయి తాము పూర్తిస్థాయిలో అప్పుల ఊబిలో ఇరుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై విద్యుత్‌ ఏఈ నిజాముద్దీన్‌ను వివరణ కోరగా రైతులకు కేటాయించిన ట్రాన్స్‌ఫార్మర్‌ తక్కువ కేవీ లతో కూడుకున్నదని ఈ ట్రాన్స్‌ఫార్మర్‌కు 23 కలెక్షన్లు ఉన్నాయని చెప్పారు. అయితే అందులో 3 మాత్రమే అనుమతి పొందిన కనెక్షన్లు అని అన్నారు. ఇప్పటికే కొంతమంది రైతులకు నోటీసులు ఇచ్చామని రైతులంతా సహకరించి మరో ట్రాన్స్‌ఫార్మర్‌కు నగదు చెల్లిస్తే రెండో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.