Aug 22,2023 19:39

ధర్నా నిర్వహిస్తున్న రైతులు

ప్రజాశక్తి - మంత్రాలయం
విద్యుత్‌ సరఫరాపై రైతులు రోడ్డెక్కారు. విద్యుత్‌ సరఫరా లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రాలయం మండలం మంచాల, చెట్నిహల్లి, కలుదేవకుంట, నందవరం మండలం నదీ కైరవాడి, ఇబ్రహీంపట్నం కొట్టాల రైతులు సుమారు వంద మంది స్థానిక సబ్‌ స్టేషన్‌ ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించారు. సుమారు 45 నిమిషాల పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న 9 గంటల ఉచిత విద్యుత్‌ సక్రమంగా ఇవ్వడం లేదని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోయి బీటలు బారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర నదిలో కొంత నీరు చేరిందని, పంటలను రక్షించుకుందామంటే విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఇవ్వకుండా దోబూచులాడుతున్నారని తెలిపారు. విద్యుత్‌ కోతల వల్ల మోటార్లు కాలి పోతున్నాయని, ఈ సమస్య సూగూరు, రచ్చుమర్రి, ఇబ్రహీంపట్నం గ్రామాల రైతులకు ఎందుకు లేదని ప్రశ్నించారు. రైతులకు ఆత్మహత్యలే శరణ్యమంటూ వాపోయారు. విద్యుత్‌ ఎడిఇ, ఎఇలు సమాధానం చెప్పేవరకు కదలబోమంటూ భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజు సంఘటన స్థలానికి చేరుకుని రైతుల గోడు విన్నారు. అనంతరం విద్యుత్‌ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పైస్థాయి నుంచి ఈ సమస్య ఉందని తెలిపారు. రైతుల సమస్యను వినతిపత్రం ద్వారా ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు సమక్షంలో తహశీల్దార్‌ చంద్రశేఖర్‌కు అందజేశారు. సమస్యను సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యుత్‌ సరఫరాపై రైతుల మద్య రగడ
- సమస్యను సానుకూలంగా మార్చిన ప్రదీప్‌ రెడ్డి

విద్యుత్‌ సరఫరా లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చేసిన రైతులకు మరో సమస్య ఏర్పడింది. సబ్‌ స్టేషన్‌ అధికారులతో ముందుగా తమ గ్రామానికి విద్యుత్‌ సరఫరా చేయాలని అటు నదీ కైరవాడి, ఇబ్రహీంపట్నం కొట్టాల రైతులు, ఇటు చెట్నిహల్లి, మంచాల రైతులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద వాదనకు దిగారు. విద్యుత్‌ అధికారులు చేసేదేమీ లేక విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్‌ రెడ్డి సబ్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు. చెరో 4 గంటల చొప్పున విద్యుత్‌ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆపరేటర్‌ను ఆదేశించారు. ఇక చెట్నిహల్లి స్కీం ద్వారా రైతులు నీటిని వాడుకోవాలని సూచించి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు.
విద్యుత్‌ సరఫరాలో రైతులకు సమ న్యాయం
విద్యుత్‌ సరఫరా విషయంలో అన్ని గ్రామాల రైతులకు సమ న్యాయం చేస్తామని విద్యుత్‌ శాఖ ఎఇ గోవిందు తెలిపారు. విద్యుత్‌ కోతలపై స్థానిక సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మంచాల, చెట్నిహల్లి, మాధవరం, రచ్చుమర్రి, సూగూరు, కలుదేవకుంట, నదీ కైరవాడి, గంగవరం, ఇబ్రహింపురం గ్రామాలకు 2.30 గంటల చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తామని తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.

రైతులతో మాట్లాడుతున్న ప్రదీప్‌రెడ్డి
రైతులతో మాట్లాడుతున్న ప్రదీప్‌రెడ్డి