Aug 16,2023 21:55

అధికారులను లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేస్తున్న రైతులు

ప్రజాశక్తి-కనగానపల్లి : మండల పరిధిలోని దాదులూరు పంచాయతీ పరిధిలోని రైతులు బుధవారం మామిళ్లపల్లిలో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారులను కార్యాలయంలోపలే ఉంచి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా దాదులూరు పంచాయతీ రైతులు మాట్లాడుతూ తమ వ్యవసాయ పంపు సెట్లకు సరఫరా అయ్యే విద్యుత్‌లో వోల్టేజ్‌ కారణంగా 15 రోజుల్లో 30 వ్యవసాయ పంపు సెట్లు కాలిపోయాని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలు పలుమార్లు అధికారులు దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యం కారణంగా తమ పంటలు ఎండి పోవడంతో పాటు మోటార్లు కాలిపోయి నష్టపోతున్నట్లు చెప్పారు. సమస్యలను పాలకులు, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. వరి పైరు నాటే సమయంలో రోజుకు ఒక గంట కూడా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం లేదని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తాము విద్యుత్‌ కార్యాలయానికి తాళం వేశామని రైతులు చెప్పారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధి కారులు స్పందించి తమకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రైతులు ప్రభాకర్‌, కేశవ, నరసింహులు, చంద్ర, మల్లి, లక్ష్మీపతి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.