మేడికొండూరు: మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు గ్రామాల్లోని విద్యుత్ సమస్యలపై అధికారులను నిల దీశారు. ఎంపీపీ మన్నవ స్వప్న అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి వైసిపి తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మందపాడు గ్రామ సర్పంచ్ ఆవులు సంజీవరెడ్డి గ్రామంలోని ప్రజలంతా తమ కార్యాలయానికి కేవలం విద్యుత్ సమస్యలతోనే వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్నారని, నిరుపేద ఇంటికి లక్ష రూ.15 వేల బిల్లు,రెండు మీటర్లు ఉంటే ఎలా వేశారని, రెండు మీటర్లు మీరు అసలు ఎందుకు ఇచ్చారని, ఇప్పుడు ఆ బిల్లు వాళ్ళు ఎలా కడతారంటూ విద్యుత్ అధికారుల తీరుపై మండిపడ్డారు. 'సమస్యలు తీర్చేందుకు నన్ను గ్రామ ప్రజలు ఎన్నికల్లో గెలిపించుకున్నారని,సమస్యలు నేను తీర్చకపోతే ఇంక నేను ఎందుకు' అని ఆయన అన్నారు.ఈ విషయంపై ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అన్ని గ్రామాల సర్పంచులు శాంతించారు. ముఖ్యఅతిథి సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయా లని అన్నారు.
.ప్రభుత్వ అధి కారులు ప్రజలకు కావాల్సిన సేవలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పి టిసి సభ్యులు కందుల సిద్దయ్య, తహశీల్దార్ కరుణ కుమార్,ఎంపిడిఒ శోభారాణి తదిత రులు పాల్గొన్నారు.










