ప్రజాశక్తి-మార్టూరు రూరల్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో అపరిష్కతంగా ఉన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జడ్పీ వైస్ చైర్ పర్సన్ చుండి సుజ్ఞానమ్మ తెలిపారు. మార్టూరు ఎంపిపి భూక్యా శాంతిబాయి అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మండలంలోని అనేక గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణాలు జరిగిన దష్ట్యా రోడ్ల ఎత్తు పెరిగి విద్యుత్ తీగలు కిందకు జారిన నేపథ్యంలో ఏర్పడిన విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ నుంచి హాజరైన సబ్ ఇంజనీర్ కిరణ్ మాట్లాడుతూ.. గ్రామాలలో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు పునరుద్ధరణ, విద్యుత్ లైన్లు ఎత్తు పెంచడం కోసం ఇప్పటికే మండలం మొత్తం మీద 150 స్తంభాలు విద్యుత్ శాఖ ద్వారా మంజూరైనట్లు తెలిపారు. బొబ్బేపల్లి, ద్రోణాదుల గ్రామాలలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాలతో పాటు, మిగతా గ్రామాలలో కూడా స్తంభాలను మార్చే ప్రక్రియ ప్రారంభిస్తామని, విద్యుత్ తీగలు కిందకు జారి ప్రమాదకరంగా ఉన్న గ్రామాలలో తక్షణమే లైన్‌మెన్‌లను పంపి సరిచేయిస్తామని కిరణ్ తెలిపారు. అనంతరం కోకిలపూడి సర్పంచ్ మోరపాకుల సతీష్ కుమార్ మాట్లాడుతూ చిలకలూరిపేట డిపో నుంచి కోలలపూడి గ్రామం మీదుగా పంగులూరు గ్రామానికి గతంలో ఉన్న బస్సును రద్దు చేశారని, గ్రామస్తుల అవసరాల దృష్ట్యా ఆ బస్సు సర్వీస్ తిరిగి పునరుద్ధరించాలని కోరారు. గ్రామంలో ఎస్‌సి కాలనీలో ఎంపిపి పాఠశాల ఆవరణలో 2015లో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేశారని, ఇప్పుడు అది శిథిలావస్థకు చేరిందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని పర్చూరు ఐసిడిఎస్ సిడిపిఓ గాదె సుభద్ర తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈఓ వస్రాం నాయక్, ఎపిఓ లక్ష్మీనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, ఆయా సమస్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిడిఓ టివి కృష్ణకుమారి, ఇతర అధికారులు ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్‌లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.










