Aug 29,2023 23:59

ప్రజాశక్తి - మార్టూరు రూరల్
విద్యుత్ వినియోగదారులు, రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు ఉమ్మడిగా కృషి చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ ఎస్‌ఇ కె సత్యనారాయణ కోరారు. స్థానిక ఇంటూరి ఫంక్షన్ హాలులో మార్టూరు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల అధికారులు, సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. మండలాల వారీగా  విద్యుత్ బిల్లుల వసూళ్లు, సమస్యలు, పరిష్కారాలు గురించి సమీక్షించారు. జిల్లా కేంద్రంలో డిజిటల్ మీటర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అవసరమైన వారు తెప్పించుకొని వినియోగదారులకు ఏర్పాటు చేయాలని అన్నారు. బిల్లుల వసూళ్ళలో యద్దనపూడి అధికారులు ముందంజలో ఉన్నారని తెలిపారు. సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు మండలాల సిబ్బంది పని తీరు మెరుగు పర్చుకోవాలని అన్నారు. లేకుంటే శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. సిబ్బంది కొరత ఉన్న చోట పని తక్కువగా ఉన్న మండలాల నుండి సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. సమస్యలు పరిష్కరించుకొని, బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. త్వరలో ఏఈలు, లైన్ మెన్ల ఖాళీలను భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గిస్తామని అన్నారు. మార్టూరు ఏఈగా పనిచేసిన ఎన్ శ్రీనివాసరావు అవకతవకలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి డీఈ నల్లూరి మస్తానరావు, మార్టూరు డిప్యూటీ డీఈ మొవ్వా సురేంద్రబాబు, ఏఈలు కిరణ్, దీపక్, సురేష్, శ్రీనివాసరావు, జెఈ హనుమంతరావు పాల్గొన్నారు.