ప్రజాశక్తి-పద్మనాభం : పద్మనాభం మండలం నేరెళ్లవలస పంచాయతీ పరిధి కొయ్యపేటలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం ఎఇ జగన్మోహన్‌రావుకు వినతిపత్రం అందించారు. వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిరంతరమూ ఆగిపోవడం, రాత్రుళ్లు అసలు కరెంటు ఉండకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు 60 మంది మూడు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలపై ఎఇ కార్యాలయానికి చేరుకొని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందించారు.
గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరారు. ఏడాది నుంచి లో-వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎండలు, ఉక్కపోతతో చిన్నపిల్లలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి హుదూద్ తుపాను సమయంలో కేబుల్ వైర్లు వేశారని, వాటిలో ఎక్కడో లోపాలున్నాయని, వాటిని వెంటనే మార్చాలని విజ్ఞప్తిచేశారు. గ్రామానికి చెందిన లైన్‌మాన్, మరో ఇద్దరు కలిసి రోజంతా లైన్‌లో తనిఖీ చేసినా లోపాలను పట్టుకోలేక పోతున్నారని వివరించారు. లైన్‌లో లోపాలతో నిరంతరం విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయని, శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని కోరారు.
10 రోజుల్లో పరిష్కరిస్తాం : ఎఇ
గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని ఎఇ జగన్మోహనరావు తెలిపారు. పాత కేబుల్, కండక్టర్ల మార్పు, మరమ్మతుల్లో ఉన్న స్తంభాల తొలగింపు తదితరాలను రూ.4 లక్షలతో చేపడుతున్నట్లు చెప్పారు. పది రోజులు పనులు పూర్తి చేస్తామని, అంతవరకు గ్రామస్తులు సంయమనం పాటించాలని కోరారు.










