May 29,2023 23:46

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌, రౌతులపూడి సామర్లకోట విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం వీచిన విపరీతమైన గాలులు, పిడుగుపాటులు, వర్షం దాటికి విద్యుత్‌ శాఖకు రూ.50 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు సామర్లకోట ఎపి ట్రాన్స్‌కో ఎడిఇ చెప్పారు. సామర్లకోట, సామర్లకోట రూరల్‌, పెద్దాపురం, పెద్దాపురం రూరల్‌ పరిధిలలో సుమారు 60 విద్యుత్‌ స్తంభాలు ధ్వంసం కాగా, అయిదు విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్‌లు పాడైనట్టు చెప్పారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు 80 శాతం పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని, మరలా వర్షం కురవడం వల్ల పనులకు అంతరాయం ఏర్పడిందని ఎడిఇ వివరించారు.
పునరుద్ధరణ పనులలో తీవ్ర జాప్యం
పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం రోజంతా కరెంటు సరఫరా నిల్చిపోగా సోమవారం ఆరు గంటలు దాటినా పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ లోగా మరలా మెరుపులు, ఉరములు, పిడుగుపాటులతో వర్షం కురియడంతో పనులకు అంతరాయం ఏర్పడినట్లయ్యింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు కారణంగా సామర్లకోట పట్టణంలో పలు ప్రాంతాలలో చెట్లుకూలడం, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్‌ లైన్‌ లు ఛిద్రం కావడం వంటి సంఘటనల నుంచి ప్రజలకు మెరుగైన సేవలను అందివ్వడం లోనూ, పునరుద్ధరణ పనులు సత్వరం చేపట్టడంలో ఆయా శాఖల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఎడిఇ కిరణ్‌ పర్యవేక్షణలో అర్బన్‌, రూరల్‌ ఎఇలు రమేష్‌ కుమార్‌, కృష్ణ లైన్‌ ఇన్స్‌పెక్టర్‌లు పనులను పర్యవేక్షిస్తున్నారు.
షార్ట్‌ సర్క్యూట్‌తో నాలుగిళ్లు దగ్ధం
రౌతులపూడి మండల కేంద్రమైన రౌతులపూడిలో సోమవారం షార్ట్‌ సర్క్యూట్‌తో నాలుగిళ్లు దగ్ధమయ్యాయి. కొప్పల రామయ్యమ్మ, కొప్పాల శ్రీను, బీజా సత్తిబాబు, దమ్ము కిషోర్‌ కు చెందిన ఇళ్లు దగ్ధమయ్యాయి. ఎంఎల్‌ఎ పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్‌ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్‌ మధు, సర్పంచ్‌ అర్జమ్మ, ఉప సర్పంచ్‌ భాస్కర్‌బాబు, వైసిపి మండల అధ్యక్షుడు శ్రీను, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.