ప్రజాశక్తి గుంటూరు సిటి : విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగాల ఆధ్వర్యములో పల్నాడు జిల్లాలోని కారంపూడి, చింతపల్లి, ఒప్పిచెర్ల, రెడ్డిపాలెం, చిన్న గార్లపాడు, చింతపల్లి, పేటసనిగండ్ల, పెదకొందమగండ్ల, గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టామని ఇఇ కె.సూర్యప్రకాష్ శనివారం ఒ ప్రకటన ద్వారా తెలిపారు. తనతోపాటు డిపిఇ, ఆపరేషన్ ఇఇ హరిబాబు ఆధ్వర్యంలో 47 మంది అధికారులు, 141 మంది సిబ్బంది 47 బృందాలుగా ఏర్పడి 4450 సర్వీసులను పరిశీలించామని, విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 108 మందికి రూ.3.99 లక్షలు అపరాధ రుసుం విధించామని తెలిపారు. మీటరు లేకుండా డైరెక్టుగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 23 మందికి రూ.41 లక్షలు, మీటర్ ఉన్నా అక్రమముగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న నలుగురికి 23 లక్షలు, విద్యుత్ శాఖ అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటున్న ఐదుగురికి రూ.19 లక్షలు, అదనంగా విద్యుత్ వినియోగిస్తున్న 74 మందికి రూ.2.86 కోట్లు, అసలైన వాడకం కంటే బిల్లు తక్కువగా ఇవ్వబడిన 2 సర్వీసులను గుర్తించి రూ.30 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు వివరించారు.
మీటర్లకు సీలు తప్పకుండా ఉండేలా వినియోగదార్లు చూసుకోవాలని, సీలు లేకున్నా, తుప్పు పట్టి ఊడిపోయినా, వెంటనే విద్యుత్ సిబ్బందికి రాత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు. సాగర తీర ప్రాంతాల్లోని మీటర్లకు ఉన్న సీల్ త్వరగా పాడయ్యే అవకాశం ఉందని చెప్పారు. సీలు లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా తొలగించడం, సిల్స్‌కు ఘాట్లు పెట్టడం గమనిస్తే దాన్ని విద్యుత్ చౌర్యంగా పరిగణించే కేసు నమోదు చేస్తామని అన్నారు. పనిచేయని మీటర్ నుండి విద్యుత్ వాడుకున్నా, ఉండాల్సిన మీటర్‌కు బదులు మరో మీటర్ ఉన్నా విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం విద్యుత్ చౌర్యంగా నిర్ధారించి మొదటి తప్పిదంగా అపరాధ రుసుం విధిస్తామని, అదే తప్పు మళ్లీ చేస్తే ఆ మీటరుదారుణ్ణి అరెస్టు చేస్తామని చెప్పారు. అపరాధ రుసుం చెల్లించలేని వినియోగదారుల నుండి రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగించి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. విద్యుత్ చౌర్యానికి సంబంధించిన ఫిర్యాదుల కోసం 9440812263, 9440812360, 9440812361 నంబర్లను సంప్రదించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తనిఖీల్లో డిఇఇలు ఎం.రవికుమార్, ఎం.శ్రీనివాసరావు, ఎఇ కె.కోటేశ్వరరావు, ఆపరేషన్ ఎఇ సిహెచ్.కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.










