అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలో బొగ్గు, సహజ వాయువు ఇంధనాలు పుష్కలంగా లభిస్తాయి. కావలసినంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దానికి తోడు సౌర, పవన విద్యుత్ తయారీ కూడా ఎక్కువగా చేయగల సామర్ధ్యం ఆ రాష్ట్రానికి ఉంది. కాని, టెక్సాస్ ప్రజలు ఈ ఏడాది చలికాలంలో నానా పాట్లూ పడ్డారు. అక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే దిగువన, మైనస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అటువంటి కాలంలో పదుల లక్షల సంఖ్యలో ప్రజానీకం విద్యుత్ సరఫరా లేక రోజుల తరబడి చాలా అవస్థలు పడ్డారు. వందలాది మంది చనిపోయారు. వేలల్లో గాయాలపాలయ్యారు. ఆ చలికి గడ్డకట్టుకుపోయిన, బద్దలైపోయిన నీటి పైపుల వలన తాగే నీరు లేకుండా పోయింది. మునిసిపల్ వాటర్ సర్వీసు విఫలమవడంతో కోటి ముప్పౖౖె లక్షల మంది టెక్సాస్ ప్రజలను తాగడానికి నీటిని మరగకాచుకోమని పురపాలక సంస్థలు కోరాయి. విద్యుత్ లేకపోవడంతో నీటిని మరగబెట్టడానికి గ్యాస్‌ను వాడదామంటే ఆ గ్యాస్ సరఫరా కూడా దెబ్బ తింది. విద్యుత్ సరఫరాలో నెంబర్ వన్ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న టెక్సాస్ రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టడానికి కారణం ఏమిటి?
అన్‌బండ్‌లింగ్ విధానం, ఓపెన్ యాక్సెస్
ఏకీకృతంగా ఒక కేంద్ర వ్యవస్థ ఆధ్వర్యంలో నియంత్రించబడుతూ వచ్చిన టెక్సాస్ విద్యుత్ వ్యవస్థను 2000 నాటికి పూర్తిగా నియంత్రణ లేని విధంగా, స్వతంత్రంగా ఎవరికి వారే, ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ఒక వ్యాపారంగా నిర్వహించే ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పారు. దీనినే అన్‌బండ్‌లింగ్ అండ్ ఓపెన్ యాక్సెస్ విధానం అంటారు. దీని సారాంశం ఏమిటి?
విద్యుత్ వ్యాపారంలో ఎంత ఎక్కువ మంది ప్రవేశిస్తే అంత ఎక్కువ పోటీ నెలకొంటుంది. దానివలన తక్కిన వారికన్నా తక్కువ ధరకే ఎక్కువ నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు దొరుకుతుంది. అందుచేత విద్యుత్ ఉత్పత్తిలో, పంపిణీలో, విద్యుత్తును ఉత్పత్తి చేసేవారి నుండి కొని పంపిణీదారుడికి అమ్మే పనిలో ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అవకాశం కల్పించాలి. అలా కల్పించాలంటే కేంద్రీకృత విద్యుత్ వ్యవస్థ ఉండకూడదు....ఇదీ అన్‌బండ్‌లింగ్, ఓపెన్ యాక్సెస్ విధానం.
విద్యుత్ కూడా సాధారణ సరుకు వంటిదేనా?
ఈ సిద్ధాంతంలో ప్రధానమైన లోపం ఏమంటే విద్యుత్తును ఒక సాధారణ వ్యాపార సరుకుగా పరిగణించడం. దుకాణానికి పోయి ఓ సబ్బునో, మరో వస్తువునో కొనుక్కున్నట్టు విద్యుత్తును కూడా కొనుక్కోవచ్చు అన్న అభిప్రాయాన్ని ఈ సిద్ధాంతం ముందుకు తెస్తుంది. అదే సరైన సిద్ధాంతం అని ఒప్పుకుంటే అప్పుడు దానికి డిమాండ్-సప్లరు సూత్రాన్ని వర్తింపజేయవచ్చు. అంటే ఎక్కువ సరుకు ఉంటే దాని రేటు తగ్గుతుంది. అదే సరుకు సప్లరు తక్కువ ఉంటే దాని రేటు పెరుగుతుంది. కాని విద్యుత్ ఒక అత్యవసరమైన మౌలిక వనరు. అంతేకాక దానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ప్రతీరోజూ, ప్రతీ గంటా ఎంత విద్యుత్ అవసరం అవుతుందో అంత విద్యుత్తును మాత్రమే సరఫరా చేయాలి. వినియోగంతో నిమిత్తం లేకుండా ముందుగానే ఎక్కువగా ఉత్పత్తి చేసి స్టాక్‌ను అట్టిపెట్టుకోడానికి సాధ్యం కాదు. ఈ డిమాండ్‌ను, సరఫరాను ఎప్పటికప్పుడు సమతుల్యత ఉండేలా చూడాలంటే కేంద్రీకృత విద్యుత్ నిర్వహణ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాల్సిందే.
రోడ్డు మీద ఉండే ట్రాఫిక్‌ను ఏ విధంగా ఒక కేంద్రీకృత ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ ద్వారా మాత్రమే నియంత్రించడం సాధ్యపడుతుందో, విద్యుత్ వ్యవస్థ విషయంలో కూడా ఆ విధంగానే సాధ్యం అవుతుంది. అందుచేత విద్యుత్తును తక్కిన వ్యాపార సరుకులా కాకుండా అత్యవసర సేవగా పరిగణించాలి. కాని నయా ఉదారవాదం ప్రతీదానినీ, అన్ని రకాల సేవలనూ కూడా, వ్యాపారంగానే చూడాలని చెప్తుంది. దానిని తు.చ. తప్పకుండా అనుసరించింది టెక్సాస్ ప్రభుత్వం. మొత్తం విద్యుత్ వ్యవస్థను పూర్తిగా అన్‌బండ్‌లింగ్ చేశారు.
ప్రైవేట్ సంస్థల తీరని దాహం
చలికాలంలో విద్యుత్ అవసరం ఎక్కువ ఉంటుంది కనుక ఆ సమయంలో విద్యుత్ రేటును బాగా పెంచి లాభం చేసుకోడానికి ప్రైవేటు పంపిణీదారులు సిద్ధం అయ్యారు. సాధారణ దినాల్లో ఒక మోగా వాట్ అవర్‌కు విద్యుత్ చార్జి 22 డాలర్లు చార్జి చేస్తే డిమాండ్ బాగా తారాస్థాయికి పోయే చలికాలంలో ఏకంగా 9000 డాలర్లు వసూలు చేశారు! దాంతో కేవలం 5 రోజుల వ్యవధిలో విద్యుత్ వ్యాపారులకు 4500 కోట్ల డాలర్ల లాభం వచ్చిపడింది! వినియోగదారులు జీవితకాలం దాచుకున్న పొదుపు సొమ్ము యావత్తూ ఆ వ్యాపారుల పాలైంది.
సంక్షోభం ముంగిట కుప్పకూలిన ప్రైవేట్ సంస్థలు
అయితే ఆ తర్వాత చలి తీవ్రత పెరిగింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు తగ్గట్టు అదనపు విద్యుత్ సరఫరా చేయగల పరిస్థితి ఆ ప్రైవేట్ వ్యాపారులకు లేదు. విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని వారు కావాలనే సమకూర్చుకోలేదు. విద్యుత్తు డిమాండ్ పెరిగితే ఉన్న విద్యుత్తునే ఎక్కువ రేటుకు అమ్ముకుని సూపర్ లాభాలు పొందడానికే వారు ప్రాధాన్యతనిచ్చారు. మంచు తుఫానులు వచ్చి విద్యుత్తుకు మరింత అదనపు డిమాండ్ వచ్చేసరికి వారివద్ద ఆ కొత్త డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేయడానికి విద్యుత్ లేదు. ఇంకో నాలుగు నిముషాల 37 సెకన్లు ఉందనగా విద్యుత్ సరఫరా చేయలేక యావత్తు విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం వచ్చింది. దాంతో అనివార్యంగా వారు విద్యుత్ సరఫరాకు కోతలు విధంచడం మొదలుబెట్టారు. దాదాపు 40 లక్షల ఇళ్ళకు రోజుల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మంచు తుఫాను కారణంగా చాలా విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు నిలిచిపోయాయి. దాంతో మరింత విద్యుత్ కొరత ఏర్పడింది. గ్యాస్ పంపింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించలేకపోయాయి. పరిస్థితి చేయి దాటిపోయింది.
తమ లాభాలనే చూసుకుంటూ వచ్చిన టెక్సాస్ ప్రైవేట్ సంస్థలు దేశంలోని ప్రధాన గ్రిడ్ లతో అనుసంధానం చేసుకోడానికి తిరస్కరించాయి. అందువలన ఈ సంక్షోభంం సమయంలో పొరుగు రాష్ట్రాల గ్రిడ్‌ల నుండి విద్యుత్తును తెచ్చుకోడానికి వీలు లేకపోయింది. చివరికి అక్కడ ఉన్న అణు విద్యుత్ ప్లాంటు కూడా ఆ మంచు తుఫాను వలన విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యం కాక మూతబడింది. ఎముకలు కొరికే చలిలో విద్యుత్తు లేక వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ ఉపకరణాలే కాకుండా ఇతర ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఆహార సరఫరాలు, వైద్య సేవలు, అత్యవసరంగా నిర్వహిస్తున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం..అన్నీ నిలిచిపోయాయి.
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ మొత్తం ప్రైవేట్‌పరం అయితే, ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు దానికి బాధ్యత వహించడానికి ఆ ప్రైవేట్ సంస్థలేవీ సిద్ధపడవు. ఆ సంక్షోభ సమయంలో సైతం తమ లాభాలనెలా కాపాడుకోవాలన్నదే వారి ప్రాధాన్యత అవుతుంది. టెక్సాస్‌లో అదే జరిగింది. చలికాలం వచ్చినప్పుడు విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతుందని ఆ సంస్థలకు తెలుసు. పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఆ సంస్థలు పూనుకోలేదు. దానికి బదులు విపరీతంగా, 300-400 రెట్లు విద్యుత్ చార్జీలను పెంచి అదనపు లాభాలను పిండుకోడానికే వారు మొగ్గు చూపారు. వారి అత్యాశ మొత్తానికి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. విధ్వంసానికి దారి తీసింది. జరిగిన విధ్వంసానికి సైతం ఆ ప్రైవేటు సంస్థలదే బాధ్యత. కాని ''మా దగ్గర సరుకు ఉన్నప్పుడు అమ్ముతాం, లేకపోతే మా దుకాణం మూసుకుంటాం'' అన్న మామూలు పచారీ కొట్టు మాదిరిగా ఆ విద్యుత్ సంస్థలు వ్యవహరించాయి.
టెక్సాస్‌లో చేపట్టిన విద్యుత్ ప్రైవేటీకరణను చాలా గొప్పగా గతంలో ప్రచారం చేసుకున్నారు. ప్రైవేటీకరణ కారణంగా టెక్సాస్‌లో విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా అవుతోందని భ్రమింపజేశారు. కాని ఆచరణలో అత్యంత ఘోరంగా విఫలమైన వైనాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు.
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ విలియం హోగన్ ఈ ఉదంతం గురించి వ్యాఖ్యానిస్తూ '' టెక్సాస్ లో ప్రైవేట్ సంస్థలు పెట్టుబడిదారీ మార్కెట్ సూత్రాలకు అనుగుణంగానే వ్యవహరించాయి'' అన్నారు. అంటే పెట్టుబడిదారీ మార్కెట్ సూత్రాలను పాటిస్తే సంక్షోభాలు తప్పవని, ప్రజలకు వాటివలన ముప్పు తప్పదని ఒప్పుకున్నట్టే.
మన దేశంలో ఎన్రాన్-ఒక చేదు అనుభవం
మన దేశంలో విద్యుత్ రంగంలో ఇదే సూత్రాలను మహారాష్ట్ర లోని దబోల్ ప్రాజెక్టు విషయంలో రెండున్నర దశాబ్దాల క్రితమే అమలు జరపడానికి ప్రయత్నించారు. ఆ ప్రాజెక్టు కోసం అమెరికన్ కంపెనీ ఎన్రాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రాజెక్టుకు 1996లో వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున గ్యారంటీ కూడా ఇచ్చింది. తీరా దబోల్ ప్రాజెక్టు నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ తక్కిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకన్నా అనేక రెట్లు ఎక్కువ ఖరీదు కావడంతో దబోల్ ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. అలా రద్దు చేసుకోడానికి దబోల్ ప్రాజెక్టు అంగీకరించలేదు. అప్పుడు ఆ ప్రాజెక్టునే మహారాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తమ కంపెనీని స్వాధీనం చేసుకున్నందువలన తాము పొందిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఎన్రాన్ కంపెనీ, అందులోని ముఖ్య వాటాదారులైన జనరల్ ఎలక్ట్రికల్, బెక్టెల్ కంపెనీలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో వివాదాన్ని లేవనెత్తాయి. కేంద్రం గ్యారంటీ ఇచ్చింది గనుక చచ్చినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించుకున్నాయి. దబోల్ ప్రాజెక్టుకు బ్యాంకులిచ్చిన రుణాలన్నీ పారు బకాయిలై, బ్యాంకులు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
పాఠాలు నేర్చుకోని ప్రభుత్వాలు
పాతికేళ్ళ క్రితం పొందిన ఈ చేదు అనుభవాన్ని కాని, తాజాగా టెక్సాస్ లో చవిచూసిన ఘోరమైన వైఫల్యాన్ని కాని పరిగణన లోకి తీసుకోకుండా మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అన్‌బండిల్ చేయాలన్న ఒత్తిడి రాష్ట్రాలపై తెస్తోంది. ఆ ఒత్తిడికి తలొగ్గి మన రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా చర్యలు తీసుకోడానికి రంగం సిద్ధం చేస్తోంది. టెక్సాస్‌లో వచ్చినట్టు ఇక్కడ మంచు తుఫాన్లు రాకపోవచ్చు. కాని విద్యుత్ వినియోగదారులపై విపరీతంగా భారాలు మాత్రం తప్పవు. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటివి ఆచరణలో అమలు కావడం ప్రశ్నార్ధకమే అవుతుంది. కొద్దిపాటి, వేళ్ళ మీద లెక్కించగల ప్రైవేట్ సంస్థల లాభాల కోసం విద్యుత్ రంగాన్ని అన్‌బండిల్ చేసి కోట్లాది ప్రజలను ఇక్కట్లపాలు చేయజూస్తున్నారు. కాని దానికి పెట్టిన ముద్దుపేరు మాత్రం 'సంస్కరణలు''!
* మూలం - ప్రబీర్ పురకాయస్థ










