Oct 25,2023 20:54

సబ్‌ స్టేషన్‌ ముందు బైఠాయించిన రైతులు

ప్రజాశక్తి - కోసిగి
విద్యుత్‌ను పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామని కోసిగి రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. 'సిఎం డౌన్‌ డౌన్‌' అంటూ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. పెండేకల్‌ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలోని సుమారు 100 మంది రైతులు బుధవారం కోసిగి సబ్‌ స్టేషన్‌ను ముట్టడించి సబ్‌ స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. విద్యుత్‌ను పట్టుకొని ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు, మండల కార్యదర్శి వీరేష్‌, సిఐటియు మండల కార్యదర్శి రాముడు, రైతులు కొండగేని వీరారెడ్డి, హనుమంతు, నరసన్న, కోసిగయ్య, అంపయ్య, నాగరాజు, అల్లయ్య, ఈరన్న, రోగన్న, నాగయ్య, అనుమప్ప, మల్లయ్యతో పాటు మరో వంద మంది రైతులు విద్యుత్‌ కోతలకు నిరసనగా సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. సబ్‌స్టేషన్‌ ముందు బైఠాయించారు. పగటిపూట 9 గంటలు విద్యుత్‌ ఇవ్వాలని ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి రోజూ 5 గంటలు కూడా విద్యుత్‌ ఇవ్వకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని నాయకులు వాపోయారు. ఓవైపు వర్షాల్లేక, మరోవైపు విద్యుత్‌ కోతలతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని, విద్యుత్‌ కోతలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.