ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తుగా అన్నిజాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తున్నట్టు విద్యుత్ శాఖ విజిలెన్సు విభాగం జిల్లా తనిఖీ అధికారి (ఇన్‌స్పెక్టర్) పి.కరుణాకరరావు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. నివాసాల వద్ద విద్యుత్ వైర్లు వేలాడుతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వర్షాకాలంలో జారిపడిన వైర్లను నేరుగా తాకొద్దని సూచించారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు తెలియజేశారు.
గృహ వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలు?
ఇంటికి ఎర్తింగ్ ఇచ్చినప్పుడు కనీసం రెండు ఎర్త్ ఎలక్ట్రోడ్‌లను అమర్చాలి. వివిధ రకాల వస్తువుల వినియోగంలో అసాధారణ శబ్దాలు వచ్చిన వెంటనే నిపుణులతో మరమ్మతు చేయించాలి. ఒకే ప్లగ్ పాయింట్ నుంచి లూజ్ వైర్, తాత్కాలికంగా అనేక పరికరాలకు కనెక్షన్లు ఇవ్వకూడదు. వివిధ రకాల విద్యుత్ ఉపకరణాలు వినియోగించే సమయంలో త్రీపిన్ ప్లగ్‌లను వినియోగించాలి. మూడవ పిన్ను తప్పనిసరిగా ఎర్తింగ్ చేయించాలి. విద్యుత్ షాక్ తగలకుండా ఉండేందుకు ఇళ్లలో ్ల 30 ఎం యాంప్ సామర్ధ్యం కలిగిన ఆర్‌సిసిబి, ఇఎల్‌సిబిలను ఉపయోగించాలి. ప్రమాదాలకు గురైన వ్యక్తిని నేరుగా చేతులతో తాకకుండా కర్రలతో తాకి విద్యుత్ వైరు నుంచి ఆ వ్యక్తిని వేరుచేయాలి. వేలాడుతున్న వైర్లకు దూరంగా ఉండి అధికారులకు తెలియజేయాలి.
పొలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పాటించాల్సిన జాగ్రత్తలు?
వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి మోటార్లు స్టార్టర్లు స్విచ్చులు ఉన్న ఇనుప బోర్డులను తప్పని సరిగా ఎర్తింగు చేయాలి. తడిచేతులతో, నీటిలో నిలబడి, వర్షంలో స్విచ్చులు వేయరాదు. మోటారు తిరగకపోతే విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు నిమిత్తం నేరుగా ఎక్కకూడదు. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండి సంబంధిత విద్యుత్ సిబ్బందికి, గ్రామ సచివాలయాల ఎనర్జీ సహాయకులకు తెలపాలి. పంట పొలాల్లో పంటను జంతువుల బారి నుంచి రక్షించేందుకు ఏర్పరచిన ఫెన్సింగ్‌లకు విద్యుత్ సరఫరా చేయొద్దు. ఇన్సులేషన్ పాడైన విద్యుత్ వైర్లను ఇన్సులేషన్ టేపుతో చుట్టాలి.
జిల్లాలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి?
ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ప్రదానంగా రైతులు పొలాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. 2022లో విద్యుత్ ప్రమాదాల వల్ల జిల్లాలో 103 మంది మనుషులు, 53 పశువులు చనిపోయాయి. 2023లో ఇప్పటి వరకు 33 మంది ప్రజలు, 71 పశువులు చనిపోయాయి. ప్రమాదాల బారినపడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తున్నాం. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
విద్యుత్ అక్రమ వినియోగంపై తీసుకున్నచర్యలు?
విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకుంటున్న వారిపై విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తారు. సాంకేతికపరమైన అంశాలు శాఖలోని అధికారులు పరిశీలిస్తారు. విద్యుత్ అక్రమంగా వినియోగించే వారికి కోర్టులో శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.










