Jun 21,2023 21:01

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

మదనపల్లె అర్బన్‌ : విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా మరో విద్యుత్‌ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని, అందుకోసం ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా జరుగు ధర్నా కార్య క్రమాలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో విద్యుత్‌ పోరు బాట పేరుతో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ వినియోగదారులు వారికొచ్చిన అధిక బిల్లులను సిపిఎం నాయకులకు చూపిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అధిక ధరలు, విద్యుత్‌ బిల్లులపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లా డుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపటం దారుణమన్నారు. అప్పుల కోసం వైసిపి ప్రభుత్వం కేంద్ర విద్యుత్‌ సంస్కరణలకు దాసోహం అవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న బిజెపి నేతలు స్మార్ట్‌ మీటర్లపై అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేయగలరా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో సోలార్‌ విద్యుత్‌ రేట్లు యూని ట్‌కు రూపాయి యాభై పైసలకు పడిపోయిందని, అయినా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. పట్టణ ప్రజలపై విద్యుత్‌ భారం తీవ్రంగా ఉందని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, అదనపు లోడ్‌ డిపాజిట్లు, అదనపు కస్టమర్‌ ఛార్జీలు వివిధ రూపాల్లో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. స్మార్ట్‌ మీటర్ల వల్ల కార్పొరేట్‌ కంపెనీలకు తప్ప ప్రజలకు ప్రయోజనం ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారం పడుతుందని, చిరువ్యాపారుల నుండి చిన్న పరిశ్రమల వరకూ ప్రతిఒక్కరూ బాధితులేనని తెలిపారు. స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని పట్టణాల్లో వర్తక, వాణిజ్య సంఘాలు, కాలనీ అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు, పౌర సంఘాలతో కలిసి 30న ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ భారాలపై సిపిఎం ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్య పరుస్తుందన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే, బాదుడని విమర్శించిన సిఎం జగన్మోహన్‌రెడ్డి బాదుడులో అందరిని మించిపోయారని విమర్శించారు. విద్యుత్‌ సంస్కరణలతో కార్పొరేట్‌ కంపెనీలు బాగుపడ్డాయని, విద్యుత్‌ రంగం నాశనం అయ్యిందని, ఫలితంగా ప్రజలపై తీవ్రమైన భారాలు పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్ర, పవన్‌, రమణ, భాస్కర్‌ పాల్గొన్నారు.