ప్రజాశక్తి-పెందుర్తి : విద్యుత్ లో-వోల్టేజీ, హై-వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జివిఎంసి 97వ వార్డు పరిధి సుజాతనగర్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట అంబేద్కర్‌నగర్, ఏకలవ్య కాలనీవాసులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు ఇందిర మాట్లాడుతూ, ఎప్పటి నుంచో తమ కాలనీలో హై-వోల్టేజీ, లో-వోల్టేజీ సమస్య ఉందన్నారు. దీనిపై విద్యుత్ అధికారుల వద్ద ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఈ సమస్య వల్ల కాలనీల్లో ఉన్న సుమారు 600పైగా ఇళ్లలో ఉన్న టీవీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కాలనీలో ప్రజలకు ఆర్థిక నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు నిర్మల, వెంకటరమణ, పైడమ్మ తదితరులు పాల్గొన్నారు.










