Oct 30,2023 22:23
విద్యుత్‌ మీటరు రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : సిఐటియు

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
         ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ మీటర్‌ రీడర్లు చేపట్టిన రాష్ట్ర మోటార్‌ సైకిల్‌ యాత్ర సోమవారం ఏలూరు పట్టణానికి చేరుకుంది. ఉదయం రాజమండ్రిలో ప్రారంభమైన ఈ యాత్ర తాడేపల్లిగూడెం మీదుగా ఏలూరు ఆశ్రం వద్ద సెంటర్‌కు చేరుకున్న సందర్భంగా జరిగిన సభలో మీటర్‌ రీడర్ల యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శివారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడారు. రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్లను ప్రభుత్వం ప్రవేశ పెట్టడం ద్వారా మీటర్‌ రీడర్ల ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనేక సంవత్సరాలుగా విద్యుత్‌ సంస్థలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మీటర్‌ రీడర్ల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందని, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. మీటర్‌ రీడర్లలో ఐటిఐ, టెక్నికల్‌ అర్హత కలిగిన వారు మీటర్‌ రీడర్లుగా పనిచేస్తున్నారని, వారిని షిఫ్ట్‌ ఆపరేటర్లగాను, వాచ్‌ టు వార్డ్‌ గాను, అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆఫీసుల్లో ఉద్యోగాలిచ్చి మీటర్‌ రీడర్లను ఆదుకోవాలని కోరారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన మీటర్‌ రీడర్లు ఎస్‌ఇ ఆఫీసుకు చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనకు మీటర్‌ రీడర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు ఒ.శ్రీనివాస్‌, జిల్లా నాయకులు మల్లేశ్వరరావు, జి.దుర్గారావు, వి.శ్రీనివాసరావు, టి.జాకబ్‌, ఎ.సతీష్‌, వంశీ నాయకత్వం వహించారు.