Feb 20,2023 22:08

యూనియన్‌ జిల్లా సమావేశం డిమాండ్‌
ప్రజాశక్తి - ఏలూరు

         విద్యుత్‌ సంస్థల స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్లలో కంపెనీ నిబంధనలు ఉల్లంఘించి మీటర్‌ రీడర్లకు నిర్ణీత రేట్లను చెల్లించని కాంట్రాక్టర్లను అనర్హులుగా ప్రకటించాలని ఎపి విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు డిఎన్‌విడి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం యూనియన్‌ జిల్లా సమావేశం కెఎన్‌.మల్లేశ్వరరావు అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ప్రసాద్‌ మాట్లాడుతూ మీటర్‌ రీడర్ల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని పలు సబ్‌ డివిజన్లలో స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టర్లు మీటర్‌ రీడర్లపై వేధింపులు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థల నిర్దేశించిన రేట్లు ఇవ్వకుండా దోచుకుంటున్నారని విమర్శించారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా కట్టకుండా కార్మికులకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా విద్యుత్‌ సంస్థల్లో మీటర్‌ రీడర్స్‌ ఎనలేని సేవలందిస్తున్నారని, అయితే సంస్థ మాత్రం మీటర్‌ రీడర్ల పట్ల చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీటర్‌ రీడింగును కేవలం 11 రోజుల్లోనే పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలివ్వడం అన్యాయమన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న మీటర్‌ రీడర్లకు వచ్చే ఆదాయం సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మరోవైపు అధికారులు మీటర్‌ రీడర్లకు ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని కూడా తగ్గించేలా నిర్ణయాలు చేయడం అన్యాయమన్నారు. మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్మార్ట్‌ మీటర్లను ప్రవేశపెట్టే ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంస్థ నిర్దేశించిన రేట్లను మీటర్‌ రీడర్లకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా అధికారులు కూడా కాంట్రాక్టర్లకే వంతపాడటం అన్యాయమని విమర్శించారు. జిల్లా అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని మీటర్‌ రీడర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వి.శ్రీనివాసరావు, జి.దుర్గారావు, జాకబ్‌, శ్రీనివాస్‌ మాట్లాడారు.