Aug 17,2023 19:44

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
          విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న మీటర్‌ రీడర్లకు ఈ ఏడాది జూలై నెల వేతనాలు తక్షణం చెల్లించాలని ఎపి విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు డిఎన్‌విడి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ కార్యాలయంలో మీటర్‌ రీడర్లు అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ మీటర్‌ రీడర్లు అరకొర వేతనాలతో జీవిస్తున్నారని, అయినా ఇచ్చే వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డోర్‌ లాక్‌, మిస్‌ మ్యాచ్‌, ఇతర టెక్నికల్‌ కారణాలు సాకుగా చూపి ఇచ్చే వేతనంలో కూడా కోత విధిస్తున్నారని, ఫలితంగా మీటర్‌ రీడర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మీటర్‌ రీడర్లకు కాంట్రాక్టర్లు మొబైల్స్‌ ఇవ్వకుండా, రీఛార్జి చేయించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మీటర్‌ రీడర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సంస్థల నిర్దేశించిన రేట్లు ఇవ్వకుండా దోచుకుంటున్నారని విమర్శించారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా కట్టకుండా కార్మికులకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా విద్యుత్‌ సంస్థల్లో మీటర్‌ రీడర్లు ఎనలేని సేవలందిస్తున్నారని, కానీ సంస్థ మాత్రం వారి పట్ల చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న మీటర్‌ రీడర్లకు వచ్చే ఆదాయం సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్మార్ట్‌ మీటర్లను ప్రవేశపెట్టే ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధికారుల తక్షణం జోక్యం చేసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశ్వరరావు, జాకబ్‌, శ్రీనివాస్‌, మునికుమార్‌, రాజేష్‌, సువర్ణరాజు, పెద్దిరాజు, వంశీ ప్రసంగించారు.