ప్రజాశక్తి-బాపట్ల: అత్యవసర సమయాల్లోనూ విధులు నిర్వర్తించే విద్యుత్ సిబ్బంది సేవలు అభినందనీయమని బాపట్ల పట్టణ విద్యుత్ ఏఈ పెరుగు శ్రీనివాసరావు అన్నారు. శనివారం లైన్‌మన్ దివస్ సందర్భంగా పట్టణ విద్యుత్ సెక్షన్ లో ఉత్తమ సేవలు అందించిన లైన్‌మన్ లను పట్టణ విద్యుత్ కార్యాలయం వద్ద శ్రీనివాసరావు సన్మానించారు. శ్రీనివాస రావు మాట్లాడుతూ పట్టణ సెక్షన్ విద్యుత్ సిబ్బంది రాత్రి సమయాల్లో తలెత్తే విద్యుత్ సమస్యలపై సత్వరమే స్పందించి విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో విద్యుత్ వినియోగ దారులకు స్థానికంగా విద్యుత్ వల్ల కలిగే అంతరాయం ఏర్పడితే తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుని విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో లైన్‌మన్‌లు బర్మా ప్రసాద్, సుధాకర్, ఎఎల్‌ఎం ఆనంద్, జెఎల్‌ఎంలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.










