Sep 03,2023 20:19

విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి గోవర్ధన్‌ రెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :విద్యుత్‌ కొరతపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని వ్యవ సాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం తోటపల్లిగూడూరు మండలం మండపం పంచాయ తీలో విద్యుత్‌ ఉపకేంద్రానికి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యుత్‌ కొరత ఏర్పడితే ప్రత్యేకించి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే విద్యుత్‌ కొరత వున్నట్లు టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో లో వోల్టేజి సమస్యలతో విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే నూతన సబ్‌ స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్న మంత్రి గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. నూతన సబ్‌ స్టేషన్‌ నిర్మాణం వల్ల మండపం చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా మరింత మెరుగు పడుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని మంత్రి కాకాణి చెప్పారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. సెప్టెంబర్‌ నెలలో కూడా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్‌ వినియోగం పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవ తీసుకొని బయట ప్రాంతాల నుండి అధిక రేట్లతో విద్యుత్‌ కొనుగోలు చేసి సరఫరా చేయిస్తున్నారని తెలిపారు. ఒక్క ఆగస్టు నెలలో సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గహ అవసరాలకు, వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరా చేయడం జరిగిందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే తమ ప్రభుత్వ ఆశయమన్నారు. సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుతో చంద్రశేఖరపురం, మండపం, కాటేపల్లి, గొల్లపాలెం, ఈదూరు, పాత కోడూరు, కొత్త పట్టపు పాలెం గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. క్యాటగిరి 1 గహ వినియోగదారులు 1620, కేటగిరీ 2 వాణిజ్య వినియోగదారులు 150, ఆక్వా కేటగిరి వి-బి క్రింద ఆక్వా వినియోగదారులు 1168, వాటర్‌ వర్క్స్‌ మరియు ఇది దీపాలకు కేటగిరి ఫోర్‌ క్రింద 124 వ్యవసాయ సర్వీసులు 1085 మొత్తం 3247 సర్వీసులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో విద్యుత్‌ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉప కేంద్రాల ఏర్పాటుతో మెరుగైన విద్యుత్‌ సరఫరా అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. తొలుత మంత్రికి స్థానిక సర్పంచ్‌ కాల్తిరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, జడ్పిటిసి శేషమ్మ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు చెరుకూరు శ్రీనివాసులు నాయుడు ఉన్నారు.