Oct 11,2023 23:21

విద్యుత్‌ శాఖాధికారికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఈపూరు : ఇష్టానుసారంగా విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయని మండల కేంద్రమైన ఈపూరులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద టిడిపి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా కనీసం నాలుగు గంటలైనా సరిగా సరఫరా చేయడం లేదని అన్నారు. లో వోల్టేజీ సమస్యతో వ్యవసాయ బోరు మోటార్లు మొరాయిస్తున్నాయని, మోటార్ల కింద పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని విమర్శించారు. కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని సబ్‌ ఇంజినీర్‌ శ్రీనివాసరావుకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి రైతుల సమస్యలపై తహశీల్దార్‌ అచ్యుత వెంకట సుధాకర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా, డిఎపి తదితర ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలి వెళ్తున్నాయని చెప్పారు. వీటిని తక్కువ ధరలకు ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆర్‌.జగ్గారావు, జి.వెంకయ్య, ఎ.కోటేశ్వరరావు, బాలయ్య, జి.వీరాంజనేయులు, ఎన్‌.కిషోర్‌, మోషే పాల్గొన్నారు.