
ఇప్పుడు విదేశీ బొగ్గు ధర బాగా పెరిగిపోయింది. డిమాండ్ పెరిగితే విదేశీ బొగ్గు కంపెనీలు తమ ఇష్టం వచ్చినట్టు ధరలను ఇంకా ఇంకా పెంచివేస్తాయి కూడా. ఇలా పెరిగిన ధరలతో అదానీ, టాటా తమ విద్యుత్ ప్లాంట్లను నడపలేక తిప్పలు పడుతున్నారు. వాళ్ళని ఆదుకోవడం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ప్రధానం అయిపోయింది. అందుకే రాష్ట్రాలు విదేశీ బొగ్గు తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని, ఆ మేరకు వాటి దేశీయ బొగ్గు వినియోగం తగ్గుతుంది గనుక ఆ దేశీయ బొగ్గును అదానీ, టాటా ల ప్లాంట్ల కు మళ్ళించాలని కేంద్రం ప్లాను చేసింది.
దేశంలో వేసవి ఇంకా తారాస్థాయికి చేరనేలేదు కాని, చాలా రాష్ట్రాల్లో అప్పుడే విద్యుత్ కోతలు మొదలైపోయాయి. ఏప్రిల్ 26 నాటికి దేశం మొత్తం మీద విద్యుత్ డిమాండ్ 200 గిగా వాట్లు ఉంది. అందులో 8.2 గిగావాట్లు కొరత ఉంది. అంటే ఇది 4 శాతం కొరత. వేసవి ఉచ్ఛ దశకి చేరేసరికి విద్యుత్ డిమాండ్ 220 గి.వా. కి చేరుతుంది. విద్యుత్ ఉత్పత్తి ఇదే స్థాయిలో కొనసాగించినా అప్పటికి కొరత 15 శాతం చేరుతుంది. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఇంకా తీవ్రంగా ఉంది. జార్ఖండ్ లో 22.3 శాతం, రాజస్థాన్ లో 19 శాతం, జమ్ము-కాశ్మీర్ లో 16 శాతం కొరత ఇప్పటికే ఉంది.
విద్యుత్ కొరత ఉందంటే దాని అర్ధం మనకు విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం తక్కువైందని కాదు. నిజానికి మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి స్థాపక సామర్ధ్యం 400 గి.వా ఉంది. అంటే మన అవసరానికి దాదాపు రెట్టింపు. ఇందులో బొగ్గు-ఆధారిత ఉత్పత్తి ప్రధానం. తక్కినది అణు, పవన, సౌర, జల ఆధారిత ఉత్పత్తి. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో 77 శాతం బొగ్గు నుండి, 2 శాతం గ్యాస్ నుండి, 9 శాతం జల విద్యుత్తుగా, 10 శాతం సౌర, పవన విద్యుత్తుగా లభిస్తోంది. వేసవిలో నిరాటంకంగా విద్యుత్తు సరఫరా కావాలంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిరంతరాయంగా నడపడమే పరిష్కారం.
ఈ బొగ్గు ఆధారిత ప్లాంట్లను నిరంతరాయంగా నడపాలంటే బొగ్గు సరఫరాకి ఎటువంటి ఆటంకమూ ఉండకూడదు. కనీస స్థాయిలో బొగ్గు నిల్వలు ప్రతీ ప్లాంటు వద్దా ఉండాలి. కాని ఉండవలసిన నిల్వలలో 30 శాతం కూడా ఉండడం లేదు. ప్లాంట్ ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి చాలా చోట్ల ఉంది.
ఇటువంటి పరిస్థితే గత సెప్టెంబర్ నెలలో కూడా ఏర్పడింది. అప్పుడు పండగల సీజన్ కనుక డిమాండ్ పెరిగింది. కాని దానికి తగ్గట్టు ఉత్పత్తిని ప్లాను చేయలేదు. దాంతో పండగల్లో సైతం విద్యుత్ కోతలను ఎదుర్కోవలసి వచ్చింది.
బిజెపి ప్రభుత్వం మాత్రం బొగ్గు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేవని, అందుచేత విద్యుత్ కొరత అనేది వాస్తవం కాదని దబాయిస్తోంది. మరి విద్యుత్ కోతలెందుకు ఉన్నాయని అడిగితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే అందుకు కారణం అంటున్నది. ఆ యుద్ధానికీ ఇక్కడ విద్యుత్ కొరతకీ సంబంధం ఏమిటని గట్టిగా అడిగితే రైల్వేలు వ్యాగన్లు అందించడంలో విఫలమౌతున్నాయని ఒకసారి... కోల్ ఇండియా బొగ్గు సరఫరా సక్రమంగా చేయలేకపోతున్నదని మరోసారి...రాష్ట్రాలు బొగ్గుకు చెల్లించవలసిన బకాయిలు పేరుకుపోతున్నాయని మరోసారి...ఇలా అతకని, పొతకని సమాధానాలు చెప్తోంది.
వేసవి వస్తోందని తెలుసు. డిమాండ్ పెరుగుతుందనీ తెలుసు. అటువంటప్పుడు ముందస్తుగానే విద్యుత్ శాఖ, ఇంధన సరఫరా శాఖ, రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవలసిన బాధ్యత ఎవరిది? కేంద్రానిది కాదా? ఆ పనే చేసివుంటే ఈ పరిస్థితి తలెత్తి వుండేదా ?
మనకి అవసరానికి రెట్టింపు స్థాపక సామర్ధ్యం ఉంది. అవసరాలకి సరిపడా బొగ్గు నిల్వలూ దేశంలో ఉన్నాయి. కాని గతేడాది సగటున విద్యుత్ ప్లాంట్ వద్ద 60-70 శాతం బొగ్గు నిల్వలు (ఉండవలసిన స్టాక్ లో) ఉండగా ఈ ఏడాది కేవలం 30-33 శాతం మాత్రమే ఉన్నాయి. మొత్తం 173 బొగ్గు-ఆధారిత ప్లాంట్లలో 105 ప్లాంట్ల దగ్గర ప్రమాదకర స్థాయి కన్నా (25 శాతం) తక్కువ మోతాదులో బొగ్గు నిల్వలు ఉన్నాయి. సరైన సమయంలో కేంద్రం బాధ్యతగా వ్యవహరించి తగు ప్రణాళిక రూపొందించి అమలు చేసి వుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.
కాని ప్రస్తుత సమస్య కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నుండి మాత్రమే ఉత్పన్నం కాలేదు. పని గట్టుకుని కేంద్రం అమలు చేసిన విధానాలే ఇందుకు ప్రధాన కారణం.
విదేశీ బొగ్గును ప్రతీ రాష్ట్రమూ తప్పనిసరిగా దిగుమతి చేసుకుని దేశీయ బొగ్గుతో దానిని మిళితం చేసి ఉపయోగించాలని, మొత్తం అవసరమైన బొగ్గులో కనీసం 10 శాతం విదేశీ బొగ్గును ఉపయోగించాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చింది. దీని వెనుక మర్మం ఏమిటి ?
మన దేశంలో అదానీ, టాటా సంస్థలు ప్రైవేటు థర్మల్ విద్యుత్ కేంద్రాలను నడుపుతున్నాయి. వాటిలో ఉపయోగించే బొగ్గును విదేశాల నుండి దిగుమతి చేసుకోడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు విదేశీ బొగ్గు ధర బాగా పెరిగిపోయింది. డిమాండ్ పెరిగితే విదేశీ బొగ్గు కంపెనీలు తమ ఇష్టం వచ్చినట్టు ధరలను ఇంకా ఇంకా పెంచివేస్తాయి కూడా. ఇలా పెరిగిన ధరలతో అదానీ, టాటా తమ విద్యుత్ ప్లాంట్లను నడపలేక తిప్పలు పడుతున్నారు. వాళ్ళని ఆదుకోవడం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ప్రధానం అయిపోయింది. అందుకే రాష్ట్రాలు విదేశీ బొగ్గు తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని, ఆ మేరకు వాటి దేశీయ బొగ్గు వినియోగం తగ్గుతుంది గనుక ఆ దేశీయ బొగ్గును అదానీ, టాటా ల ప్లాంట్ల కు మళ్ళించాలని కేంద్రం ప్లాను చేసింది.
టాటా, అదానీ తదితర కార్పొరేట్ల ప్రైవేట్ ప్లాంట్లు పోర్టులకు దగ్గరగా నిర్మించుకున్నారు. విదేశీ బొగ్గును ఆ రేవుల్లో దించుకున్నాక రవాణా ఖర్చు తగ్గించుకోడానికి ఆ విధంగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనులకు దగ్గరగా తమ విద్యుత్ ప్లాంట్లను నిర్మించుకున్నాయి. దానివలన వాటికి రవాణా తేలిక అవుతుంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసిన నిర్ణయం పుణ్యమా అని విదేశీ బొగ్గును ప్రభుత్వ ప్లాంట్లు రేవు పట్టణాల నుండి తమ వద్దకు రవాణా చేసుకోవాలి. అదే విధంగా బొగ్గు గనుల వద్ద నుండి బొగ్గును టాటా, అదానీ ప్లాంట్లు ఉన్న రేవు పట్టణాలకు రవాణా చేయాలి. రెండు వైపులా ఖర్చు పెరిగింది. ఈ పెరిగిన ఖర్చును భరించేది అంతిమంగా వినియోగదారులే. అయితే ఈ అనవసర రవాణా వలన రైల్వే వ్యాగన్ల కొరత పెరిగిపోయింది.
అంతే కాదు, ఖరీదైన విదేశీ బొగ్గును తప్పనిసరిగా ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లు వాడవలసి రావడంతో విదేశీ బొగ్గు సరఫరాదారులు తమ రేట్లను 3-4 రెట్లు పెంచివేసే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చు ధరను చెల్లించి ఆ బొగ్గును కొనుగోలు చేయాల్సి వస్తుంది. అంటే విద్యుత్తు ధరలు ఇంకా మరింత పెరుగుతాయన్నమాట.
విదేశీ బొగ్గును వాడుతామనే కదా అదానీ, టాటా తమ ప్లాంట్లను స్థాపించినది? ఆ విదేశీ బొగ్గు విషయంలో ఇబ్బందులు తలెత్తితే అందుకు వాళ్ళే కదా పూర్తిగా బాధ్యత వహించాలి? నడుపుతారో, లేక మూసేసుకుంటారో అది వాళ్ళ ఇష్టానికి వదిలేసి ప్రభుత్వం తన ఆధ్వర్యంలోని ప్లాంట్ల సంగతి చూసుకోక, ఆ కార్పొరేట్ ప్లాంట్లను కాపాడడానికి ప్రభుత్వ ప్లాంట్లను బలి పెడుతోంది. ఒక విధంగా చూస్తే ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లు ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లకు సబ్సిడీ ఇస్తున్నాయని చెప్పాలి. ఆ భారాన్ని వినియోగదారులు మోయవలసి వస్తోంది.
అసలే ఆర్థిక సంక్షోభం. దానికి కరోనా ఇబ్బందులు తోడయ్యాయి. ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి సహాయమూ లేదు. ఇది చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి. ఇప్పుడు పులి మీద పుట్రలా ఆ ఇబ్బందులకి తోడు విద్యుత్ కొరత, ఇంకోపక్క చార్జీల పెంపు కూడా తోడయ్యేసరికి ఈ పరిశ్రమలు కుదేలవుతున్నాయి. దాని వలన వేలాదిగా కార్మికులు రోడ్లపాలౌతున్నారు.
మూడు దశాబ్దాల విద్యుత్ సంస్కరణల అమలు తర్వాత, 400 గి.వాట్ల స్థాపక సామర్ధ్యం ఉండి, అందులో సగం డిమాండ్‌ను కూడా అందుకోలేని దుస్థితిలో మన దేశం ఉంది. ఒకవైపు విద్యుత్ కోతలు, దానికి తోడు విద్యుత్ చార్జీల మోత నానాటికీ పెరుగుతోంది. ప్రైవేటు ఉత్పత్తిదారులు బాగుపడడానికి తప్ప ఈ సంస్కరణలు దేశానికి ఏమాత్రమూ ఉపయోగపడడం లేదని స్పష్టం అయిపోయింది. దీనికి మోడీ ప్రభుత్వం తన కార్పొరేట్ సేవాభిలాషతో మరిన్ని చిక్కులు సృష్టిస్తోంది. తన పాత్ర బైట పడకుండా ఉండేందుకు రకరకాల సాకులు చెప్తోంది. ఈ మోసాన్ని ప్రజలంతా నిగ్గదీయాలి.
( సంక్షిప్తానుసరణ )
అంజలి
ప్రబీర్ పురకాయస్థ