Aug 14,2023 22:27

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌, జెసి

* 'స్పందన'లో కలెక్టర్‌కు ఫిర్యాదు
* పలు సమస్యలపై 190 వినతులు స్వీకరణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
వేళాపాళా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని, ఉన్న సమయంలోనూ లోఓల్టేజీ వస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పాతపట్నం, మెళియాపుట్టి, మందస ప్రాంతాల నుంచి పలువురు రైతులు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ బోర్లు పనిచేయకపోవడంతో నాట్లు వేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. పలు సామాజిక, వ్యక్తిగత సమస్యలపై స్పందనకు 190 వినతులు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా వక్ఫ్‌ భూముల సర్వే నిర్వహించలేదని, సర్వే చేసి ఆక్రమణలకు గురికాకుండా భూములను కాపాడాలని వక్ఫ్‌ బోర్డు జిల్లా చైర్మన్‌ మహమ్మద్‌ సిరాజుద్దీన్‌, ఎం.ఎ బేగ్‌, షేక్‌ ఆమన్‌ తదితరులు కోరారు. వంశధార ఎడమ కాలువ ఆయకట్టు శివారు ప్రాంతమైన పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాలకు సాగునీరందడం లేదని పలువురు రైతులకు ఫిర్యాదు చేశారు. నీటిపారుదలశాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యను పరిష్కరించడం లేదని చెప్పారు.
స్పందన, జగనన్నకు చెబుదాం ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ అధికారులను హెచ్చరించారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. పరిష్కారంలో నాణ్యత ఉండాలన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని చెప్పారు. విచారణ చేపట్టకుండా ఫిర్యాదుదారునికి వివరణ ఇవ్వడం సరైన విధానం కాదన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీవ్‌, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ మురళీకృష్ణ, ప్రత్యేక ఉప కలెక్టర్‌ జయదేవి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌, డిఎస్‌ఒ వెంకటరమణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.