ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వేసవి తీవ్రతతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో విద్యుత్ కోతలు పెరిగాయి. అదనపు లోడ్ రిలీఫ్ పేరుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆకస్మికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్లు కోటా ఉండగా 20 మిలియన్ యూనిట్లు వినియోగం ఉంటుందని అధికారులు చెబుతుండగా రాత్రి వేళ ఏసీలు, కూలర్లు వినియోగం గణనీయంగా పెరిగింది. ఎండ తీవ్రతకు విద్యుత్ పరికరాలుకూడా దెబ్బతింటున్నాయని, వీటిని మరమ్మతుల కోసం కొన్ని సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని అధికారులు అంటున్నారు. విటిపిఎస్‌లో విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడటం వల్ల బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు చాలాప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు.
రాత్రి సమయాల్లో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్తు ఆపేస్తున్నారంటూ బుధవారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2గంటల వరకు ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి-5 సెక్షన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పాత గుంటూరు, అలీ నగర్, శుద్ధపల్లి డొంక, ఆంజనేయస్వామి గుడి వీధి, భూర్లు వారి వీధికి చెందిన ప్రజలు స్థానికప్రతిరోజు రాత్రి సమయంలో కరెంటు పోతుందని, కరెంట్ ఆఫీస్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన బిజీ వస్తోందని, ఎండల తీవ్రత అధికంగా ఉన్న ఈ సమయంలో రాత్రి వేళల్లో కరెంటు పోవడం వల్ల వుక్కపోతకి పిల్లలు నిద్రపోవట్లేదని విధులు పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ధర్నా చేశారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పిడుగురాళ్ల పట్టణంలో అర్ధరాత్రి అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల దాడికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట మండలంలో బుధవారం రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ కోతలు అమలు చేశారు. తెనాలిలో బుధవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటలవరకు రెండున్నర గంటలపాటు ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేశారు. పగటి సమయంలో కూడా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడున్నర వరకు విద్యుత్ సరఫరా లేదు. పగలంతా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.










