Nov 08,2023 21:48

ఫొటో : రోడ్డుపై బైఠాయించిన రైతులు

విద్యుత్‌ కోసం రోడ్డెక్కిన రైతులు
ప్రజాశక్తి-జలదంకి : విద్యుత్‌ సరఫరా కోసం మండల రైతాంగం రోడ్డెక్కిన వైనం బుధవారం మండలంలోని కావలి - ఉదయగిరి రోడ్డుపై చోటు చేసుకుంది. 10 రోజుల నుండి తమ గ్రామాలకు విద్యుత్‌ సరఫరా లేదంటూ మండలంలోని నెహ్రూ నగర్‌ గిరిజన కాలనీ, అప్పారావు తోట గిరిజన కాలనీ, కర్కోరి పాలెం, జలదంకి, ఎల్లార్‌ అగ్రహారం ఫీడర్‌ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన బాట చేపట్టారు. లింగరాజు అగ్రహారం ఫీడర్‌ మరమ్మతులకు గురి కావడం వల్ల పది రోజుల నుండి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆ మార్గంలో నడిచే వాహనాలను నిలిపివేసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడం కారణంగా తాము సిద్ధం చేసుకున్న నారుమడులు ఎందుకు పనికి రాకుండా పోయాయని ఆవేదన వెలిబుచ్చారు. దాంతోపాటు తాగునీరు సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయి, నానా అవస్థలు పడుతున్నామని తమ దీనస్థితిని వెలిబుచ్చారు. విద్యుత్‌ సరఫరా లేని విషయాన్ని తాము ముందుగానే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని వాపోయారు.
దాంతో విధి లేని పరిస్థితులలో తాము రోడ్డెక్కి ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వాపోయారు. ఉన్నత అధికారులైన స్పందించి తమ గ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభ్యర్థించారు. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో తమ గోడును సంబంధిత అధికారులకు విన్నవించుకున్న వారిలో స్పందన కరువైందని ఆవేదన వెలగక్కారు. ఈ విషయంపై రైతాంగం జలదంకి సబ్‌స్టేషన్‌ అధికారులను ప్రశ్నించగా మీ ప్రాంతానికి చెందిన లైన్‌మెన్‌ నియామకం 6 నెలల నుండి జరగని కారణంగా మీకు ఈ దుస్థితి ఏర్పడిందని అధికారులు అంటున్నారని రైతులు వాపోయారు. ఈ విషయం ప్రభుత్వం ఉన్నత అధికారులకు సంబంధించిన విషయం కాబట్టి ఇందులో తామేమి జోక్యం చేసుకోలేమంటూ సబ్‌స్టేషన్‌ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెపుతున్నారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము తమ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చిందన్నారు. రైతులు ఆందోళనతో కావలి ఉదయగిరి రోడ్డుపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో స్థానిక ఎస్‌ఐ పి.ఆదిలక్ష్మి తమ సిబ్బందితో కలిసి రైతులకు నచ్చచెప్పి ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తగిన న్యాయం చేస్తామని వారికి హామీనిచ్చారు. దాంతో రైతులు తమ ఆందోళన కార్యక్రమాన్ని విరమించి సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ విషయాన్ని రైతులు ఎఇఇఇ చంద్రశేఖర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అందుబాటులో లేరు. ఎస్‌ఐ పి.ఆదిలక్ష్మి హామీతో రైతులు తమ ఆందోళనను విరమించారు. వెంటనే తమకు లైన్‌మెన్‌ను ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కుట్టుబోయిన కృష్ణ, చలంచర్ల రాంబాబు, పసల రమేష్‌, లెక్కల మాల్యాద్రి రెడ్డి, గోసు మధు, పసల రామయ్య, పొట్లూరి ధనయ్య, పొట్లూరి శ్రీనయ్య, కొమరగిరి శ్రీనయ్య, డేగ వెంకటేశ్వర్లు, కొమరగిరి అల్లూరయ్య, కసుకుర్తి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.