Aug 27,2023 23:09

ఎల్‌.దైవప్రసాద్‌, ఎపి ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ

* ఈ నెలాఖరులోగా చేయించుకోవాలి
* గృహావసరాలకు ఇబ్బంది లేకుండా కరెంట్‌ సరఫరా
* లోడ్‌ రిలీఫ్‌ కోసం పరిశ్రమలకు కొద్దిసేపు కోత
* వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌
* ఎపి ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ ఎల్‌.దైవప్రసాద్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారులు ఈ నెలాఖరులోగా వారి విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ నంబరుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపి ఇపిడిసిఎల్‌) ఎస్‌ఇ ఎల్‌.దైవప్రసాద్‌ తెలిపారు. విద్యుత్‌ బిల్లు చెల్లింపు సమయంలో గానీ, లైన్‌మెన్‌, బిల్‌ కలెక్టర్‌, సెక్షన్‌ కార్యాలయం, విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయంలో గానీ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గృహ వినియోగదారులు ఇబ్బంది పడకుండా కరెంట్‌ సరఫరా చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా అవసరాలకు తగ్గట్టు విద్యుత్‌ పంపిణీ జరగని సందర్భంలో అధికంగా వినియోగిస్తున్న పరిశ్రమలకు లోడ్‌ రిలీఫ్‌ కోసం కొద్ది గంటల పాటు కరెంట్‌ సరఫరా ఆపుతున్నాం తప్ప ఇళ్లకు విద్యుత్‌ సరఫరా ఆపడం లేదని తెలిపారు. వాతావరణ పరిస్థితుల బట్టి కరెంట్‌ వినియోగం పెరగడం, కోటా తగ్గడంతో పరిశ్రమలకు కొంత సమయం కోత పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఇస్తున్న 200 యూనిట్ల సబ్సిడీని ఇతరులు వాడుకున్నట్లు గుర్తించామని, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రజాశక్తి ముఖాముఖిలో విద్యుత్‌ పంపిణీ, కోతలు, లోడ్‌ రిలీఫ్‌ వంటి అంశాలపై మాట్లాడారు.
జిల్లాలో విద్యుత్‌ వినియోగం, కోటా పరిస్థితి ఎలా ఉంది?
జిల్లాలో మొత్తం 9,23,416 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో గృహ వినియోగ కనెక్షన్లు 7,89,151, వాణిజ్య కనెక్షన్లు 76,476 ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి 3,067 వీధిదీపాలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించి 22,154 కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు సుమారు 24 వేలు ఉన్నాయి. రోజువారీ వినియోగం సగటున ఐదు మిలియన్‌ యూనిట్ల వరకు ఉంటుంది. జిల్లాకు వస్తున్న కోటా సుమారు ఐదు మిలియన్‌ యూనిట్లే ఉంది. వాతావరణ పరిస్థితులను బట్టి వినియోగం కాస్త పెరుగుతుంది.
వేళాపాళా లేకుండా కరెంట్‌ తీసేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి?
జిల్లాకు ఆయా రోజుల్లో రావాల్సినంత మేర కోటా రాని పక్షంలో ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఇఎల్‌ఆర్‌)పేరుతో రెండు, మూడు గంటల పాటు ఆపాల్సి వస్తోంది. విద్యుత్‌ కోతలు మాత్రం విధించడం లేదు. విండ్‌ ఎనర్జీ ఉత్పత్తిలో సమస్యలు వచ్చినప్పుడు ఒత్తిడి పడకుండా ఇఎల్‌ఆర్‌ విధించాల్సి వస్తోంది. అనధికారికంగా కోతలేమీ విధించడం లేదు.
గృహ వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా చేపడుతున్నారా?
జిల్లాకు విద్యుత్‌ పంపిణీ కోటా తగ్గిన రోజుల్లో గృహ వినియోగదారులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. గ్రిడ్‌ల నుంచి వచ్చే విద్యుత్‌లో ఫ్రీక్వెన్సీ బట్టి సరఫరాలో మార్పులు చేస్తున్నాం. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా కావడం లేదు. జిల్లాలో భారీ పరిశ్రమల వరకు కొద్ది సమయం కరెంట్‌ ఆపుతున్నాం. అధిక కరెంట్‌ వాడుతున్న జిల్లాలోని ఆరు పరిశ్రమలకు కొద్ది సమయం విద్యుత్‌ సరఫరాను ఆపుతున్నాం.
జిల్లాలో ఖరీఫ్‌ సాగు నేపథ్యంలో ఒకవైపు వర్షాలు లేక, బోర్లతో పొలాలను తడుపుకోవడానికి కరెంట్‌ సరఫరా సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు?
వ్యవసాయానికి రోజూ పగటి పూటే తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. రైతులకు అందిస్తున్న కరెంట్‌లో ఎక్కడా ఇబ్బంది లేదు. కలెక్టర్‌ సూచనలతో కొన్ని ఎత్తిపోతల పథకాల వరకు కరెంట్‌ను ఆపాం. వాటి కింద ఉన్న బోర్లతో సాగువుతున్న భూములకు కొంత ఇబ్బంది ఉండొచ్చు.
విద్యుత్‌ కనెక్షన్‌కు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరా?
విద్యుత్‌ కనెక్షన్‌కు ప్రతి ఒక్క వినియోగదారుడూ ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి. అనుసంధాన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. లైన్‌మెన్‌, విద్యుత్‌ కార్యాలయాలు, బిల్‌ కలెక్టర్లకు వినియోదారులు తమ ఆధార్‌ ధువ్రపత్రాలను అందించి ఈ నెలాఖరులోగా అనుసంధానం చేయించుకోవాలి.
ఎస్‌సి, ఎస్‌టిలకు ఇస్తున్న 200 యూనిట్ల సబ్సిడీని కొన్నిచోట్ల ఇతరులు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టారు?
ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్‌ వరకు సబ్సిడీని ఇస్తోంది. జిల్లాలో కొందరు ఒసిలు, బిసిలు వాటిని వినియోగించుకున్నట్లుగా గుర్తించాం. ఇప్పటికే అటువంటి వారికి బిల్లులు జారీ చేశాం. పూర్తిస్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నాం.