Jul 28,2023 19:44

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

ప్రజాశక్తి-గుంటూరు : విద్యుత్‌ రంగంలో ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతుతోపాటు, ప్రత్యక్ష ఆందోళనలోనూ పాల్గొంటామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి అన్నారు. శుక్రవారం స్థానిక పాతగుంటూరులోని యూనియన్‌ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, జెఎల్‌ఎం గ్రేడ్‌-2 (ఎనర్జీ అసిస్టెంట్లు)తో సహా ఏ ఒక్క అంశాన్నీ తేల్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు చాలా ఎక్కువ అని కొంతమంది ప్రభుత్వ పెద్దలు, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు అవహేళన చేస్తున్నారని చెప్పారు. 2018 పిఆర్‌సి గడువు ముగిసి 15 నెలలు దాటినా కొత్త వేతన ఒప్పందానికి యాజమాన్యం సిద్ధపడట్లేదని, తెలంగాణ కంటే ఎపిలో విద్యుత్‌ ఉద్యోగులు 30 శాతం తక్కువ జీతాలు పొందుతున్నారని తెలిపారు. తెలంగాణలో కాంట్రాక్టు స్కిల్డ్‌ కార్మికులకు నెలకు రూ.43,162లు ఉంటే, ఇక్కడ మాత్రం కేవలం రూ.20,598లు ఇస్తున్నారని, కార్మికుల సమస్యలను యాజమాన్యంగానీ, ప్రభుత్వంగానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. తాము అధికారంలోనికి వస్తే అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని మండిపడ్డారు. జూనియర్‌ లైన్‌మెన్‌ (గ్రేడ్‌-2)లు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్నారని, వారి ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ పూర్తికాని కారణంగా మరణించిన వారి స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టట్లేదని చెప్పారు. ఉద్యోగుల పిఆర్‌సి, కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణ, ఇతర సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని, వారు నిర్ణయించుకొని చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలో భాగంగా జరుగుతున్న పరిణామాలు, విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, సంస్థ రక్షణకోసం జరిగే పోరాటలో ప్రత్యేక్ష కార్యాచరణలో భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు. సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎం.సాంబశివరావు, ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.చెంగయ్య, షేక్‌ హుస్సేన్‌వలి, ఎన్‌.రమాసుష్మా, కార్యదర్శులు బి.లక్ష్మణరావు, బి.ముత్యాలరావు, ఎం.భాగ్యరాజు, ఎన్‌.రమేష్‌ పాల్గొన్నారు.