సిఐటియు జిల్లా కార్యదర్శి కమల
ప్రజాశక్తి - జగ్గయ్యపేట, వీరులపాడు: మండలంలో చిలకల్లు తెర్లగంటపాలెం వేదాద్రి ఆటోనగర్ జగ్గయ్యపేట బలుసుపాడు, సంతకాల సేకరణలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, చిల్లకల్లు విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం వద్ద కార్మికులనుద్దేశించి ఎ.కమల మాట్లాడారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించుకుని వినతిపత్రాలు అందజేసిన పట్టించుకోకపోవడంతో, దశలవారీగా, ఆందోళన పోరాటాలకు సిద్ధమయ్యారని ఆమె తెలిపారు. కార్మికుల పట్ల, వారి సమస్యల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. వారు చేస్తున్న ఆందోళన పోరాటాలకు కార్మికుల తరఫున సిఐటియు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. పవర్ జెఎసి రాష్ట్ర ప్రభుత్వంతో, ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులకు తెలియజేయకుండా, వారి అంగీకారం లేకుండా, పవర్ జెఎసి ఒప్పందం చేసుకోవటం చట్ట వ్యతిరేకమని, ఆ ఒప్పందాన్ని ఉద్యోగ కార్మికులు అంగీకరించడం లేదని, తక్షణమే కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకొని, ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని, అప్పటివరకు కార్మికుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు రివర్స్ పి.ఆర్ అమలు చేసి, కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులకు రూ.40 వేలు జీతం అందుతుంటే, మన రాష్ట్రంలో రూ.21 వేలు మాత్రమే అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి షేక్ గౌస్‌మియా, జె.ఏసు రత్నం, ఐ.ఎస్ రాజు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.










