Aug 16,2023 19:56

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు

ప్రజాశక్తి-ఆలూరు
విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేసిన యాజమాన్యం, విద్యుత్‌ జెఎసి వేతన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక శాఖకు లేఖలు రాయనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు తెలిపారు. బుధవారం ఆలూరు సబ్‌ డివిజన్‌లో ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, అధికారుల సమస్యలపై విద్యుత్‌ జెఎసి నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత అంగీకారమా లేదా అని ఉద్యోగ కార్మికులతో చర్చించాలని తెలిపారు. అప్పుడు నిర్ణయం తీసుకోవాలని, అలా కాకుండా ప్రభుత్వం చెప్పిన దానికి తలొగ్గి చట్టవ్యతిరేకంగా ఒప్పందం చేసుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికులు, ఇంజినీర్లు, అధికారులు తమకు అంగీకారం లేదని వ్యక్తిగతంగా రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు మేయిల్‌ లేదా రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా లేఖ పంపాలని తెలిపారు. డిమాండ్లను పరిష్కరించే వరకు వివిధ దఫాలుగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణస్వామి, విద్యుత్‌ ఉద్యోగులు కాలప్ప, నాగేంద్ర, నటరాజు పాల్గొన్నారు.