ప్రజాశక్తి - సాలూరు : పట్టణంలో గత కొంతకాలంగా విద్యుత్ దీపాలు వెలగడం లేదని, దీన్ని ఎప్పుడు పరిష్కరిస్తారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు పలు సమస్యలపై మాట్లాడారు. తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గొర్లి జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత కొంతకాలంగా పట్టణంలో వీధి దీపాలు వెలగడం లేదన్నారు. అసలే వర్షాకాలంలో విరివిగా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు. మున్సిపల్ ఎఇ సూరి నాయుడు మాట్లాడుతూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలో అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు వేసి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లందరికీ నోటీసులు జారీ చేయాలని కౌన్సిలర్లు గిరిరఘు, రాపాక మాధవరావు కోరారు. 14,15 ఆర్ధిక సంఘం నిధులతో పనులు చేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ మాట్లాడుతూ 14ఆర్ధిక సంఘం నిధులు వెనక్కి పోయాయని, వాటి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావన అని ప్రశ్నించారు. 11వ వార్డులో నీటి సమస్య గురించి ఏడాదిగా చెపుతున్నానని కౌన్సిలర్ లింగాల దుర్గా చెప్పారు. వార్డు ప్రజలు తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదో వార్డులో విద్యుత్ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారని కౌన్సిలర్ జి.వరప్రసాద్ ప్రశ్నించారు. 28వవార్డు కౌన్సిలర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణంలోని 14సచివాలయాల్లో 20మంది ఉద్యోగులు బదిలీపై వెళ్లిపోయారని, దీని వల్ల ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ హెచ్ శంకరరావు మాట్లాడుతూ సచివాలయాల్లో 19మంది ఉద్యోగులు బదిలీ అయ్యారని, ఐదుగురు ఉద్యోగులు విధుల్లో చేరారని చెప్పారు. 14ఖాళీలు వున్నాయని తెలిపారు. 29వ వార్డు కౌన్సిలర్ గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో దోమల బెడద ఎక్కువగా వుందని, ఫాగింగ్ చేస్తున్న దాఖలాల్లేవని చెప్పారు. ఒకే ఫాగింగ్ మిషన్ వుండడంతో ఫాగింగ్ వేగంగా జరగడం లేదని సిబ్బంది చెబుతున్నారని చెప్పారు. శానిటేషన్ అధికారి ఫకీర్ రాజు మాట్లాడుతూ నాలుగు ఫాగింగ్ మిషన్లు పని చేస్తున్నాయని, ఫాగింగ్, స్ప్రేయింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.










