విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి !
వామపక్ష నాయకుల నిరసన
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు చూడగానే ప్రజలకు షాక్ కొడుతుందని వామపక్ష పార్టీ నాయకులు విమర్శించారు. వామపక్ష పార్టీలు రాష్ట్ర సమితి పిలుపు మేరకు కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రజాపోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఆదివారం తిరుపతి బాబూ జగజ్జీవన్ రావు పార్క్, ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో మార్నింగ్ వాకర్స్‌కు ఉదయం 6 గంటలకు వామపక్షపార్టీల ఆధ్వర్యంలో కరపత్రాలు పంచిపెట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.వెంకటరత్నం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయి నాలుగు సంవత్సరాలలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. పెరిగిన విద్యుత్ బిల్లులతో జనం గుగ్గోలు పెడుతున్నారని, విద్యుత్ వాడకపోయినా కస్టమర్ చార్జీలు, సర్ చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో బిల్లులిచ్చి ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నాలుగేళ్లలో 25వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపి వసూలు చేశారని తెలిపారు. ఆదాని కంపెనీకి కోట్ల రూపాయలు సమకూర్చడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు మోటార్లకు మీటర్ల బిగించే కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదాని కంపెనీకి రెడ్ కార్పొరేట్ పరిచి రైతు మోటార్లకు మీటర్ల బిగించడమే కాకుండా, ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆ కాంట్రాక్ట్ కూడా ఆదాని కంపెనీకే ఇచ్చారని తెలిపారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలపై మరింత భారం మోపి విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తారని అన్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యమంతో కచ్చితంగా బుద్ధి చెప్తామని పిలుపునిచ్చారు. సిపిఎం నగర కార్యదర్శి టి.సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర, మాధవ్, వేణు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె.రాధాకష్ణ, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్‌డి.రవి, ఎన్.శివ, కేవైరాజా, పద్మనాభరెడ్డి, రామకష్ణ, సిపిఐ (ఎంఎల్) జిల్లా నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.










