Sep 27,2023 22:32

ప్రజాశక్తి-అమలాపురం
పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి. దుర్గాప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి వామపక్ష పార్టీల నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొప్పుల సత్తిబాబు, సిపిఎంఎల్‌ సీనియర్‌ నాయకులు మచ్చా నాగయ్య మాట్లాడుతూ వేసవి గడిచినా విద్యుత్‌ బిల్లులు భారీగా వస్తున్నాయన్నారు. ప్రతినెలా ఛార్జీలు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని విద్యుత్‌ దోపిడీ సాగిస్తున్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామని, 200 యూనిట్ల వరకు అందరికీ ఉచిత విద్యుత్‌ ఇస్తామని వైసిపి మాట ఇచ్చి నమ్మకద్రోహం చేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం వివిధ రూపాలలో విద్యుత్‌ భారాలు మోపుతుందనీ ఛార్జీల పెంపు, ట్రూ అప్‌ చార్జీలు, సర్దుబాటు చార్జీలు, విద్యుత్‌ సుంకం, ఫిక్స్‌ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు, సర్‌ చార్జీలు, అదనపు డిపాజిట్లు ఇలా రకరకాల పేర్లతో ప్రజలను కొల్లగొడుతున్నదన్నారు. ప్రతి నెలా విద్యుత్‌ చార్జీలు పెంచే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. రైతుల ఉచిత విద్యుత్‌ కు ఎసరు పెడుతున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, వత్తిదారులకు ఇస్తున్న రాయితీలకు కోత పెడుతున్నారన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రానున్న కాలంలో సబ్సిడీ ఎత్తివేయాలని ఆలోచిస్తోందన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టడానికి టెండర్లు పిలిచారనీ అదాని తదితర కార్పొరేట్లకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టారన్నారు. ముందుగానే విద్యుత్‌ బిల్లులు చెల్లించే ప్రీపెయిడ్‌ విధానం ప్రవేశపెడుతున్నారనీ స్మార్ట్‌ మీటర్ల కయ్యే రూ.వేలు వినియోగదారులే భరించాలని, రాత్రిపూట వినియోగించుకునే కరెంటుకు అదనపు బిల్లులు వేసే ప్రమాదకర విధానం తెస్తున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విద్యుత్‌ చట్టానికి సవరణలు ప్రతిపాదనలు పార్లమెంటు ముందున్నాయన్నారు. విద్యుత్‌ రంగాన్ని అదానీ, కార్పొరేట్లకు కట్టబెడుతున్నారనీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, కార్పొరేట్లకు పూర్తిగా లొంగిపోయిందనీ గతంలోని ప్రభుత్వాలు అడ్డగోలుగా బడా కంపెనీలతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను సమీక్షిస్తామని మాట ఇచ్చి నేడు వైసిపి అదే బాటలో ప్రయాణిస్తున్నదన్నారు. 30 సంవత్సరాల పాటు వ్యవసాయ విద్యుత్తు అందించే కాంట్రాక్టును కట్ట పెట్టారని అన్నారు. 2000 సంవత్సరంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడారనీ ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలర్పించారన్నారు. ప్రజలు తిరస్కరించిన ప్రపంచ బ్యాంకు సంస్కరణలను నేడు కేంద్రం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేసారు.భవిష్యత్తులో విద్యుత్‌ రంగం పూర్తిగా కార్పొరేట్ల కబంధహస్తాల్లోకి వెళుతున్నదన్నారు. చార్జీలు మరింతగా భారం కానున్నాయని, తక్షణం విద్యుత్‌ భారాలు తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్లు ఆపాలని, ప్రమాదకరమైన విద్యుత్‌ సంస్కరణలు రద్దు చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలనీ విద్యుత్‌ చట్ట సవరణ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజలంతా చార్జీల భారం తగ్గింపు కొరకు, ప్రమాదకరమైన కార్పొరేటీకరణ విధానాలు రద్దు కోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. అలాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులు పీతల రామచంద్రరావు, దైవవాణి, విప్పర్తి మోహనరావు, పాము బాలయ్య, తాడి శ్రీరామమూర్తి, తులసీరావు, ఊటాల వెంకటేష్‌ , కంచే సత్యనారాయణ, బీమాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.