ప్రజాశక్తి-పిఠాపురం పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు విధానాన్ని ఉపసంహరించుకోవాలని శనివారం పట్టణంలోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎలక్ట్రికల్ ఎఇకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుంచే చిన్న, కోనేటి రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తుచ తప్పకుండా పాటిస్తున్న విధానాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలన్నారు. నూతన విద్యుత్తు సవరణ చట్టాన్ని రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై అధికబారాలు మోపుతున్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఛార్జీల బాదుడు ఉండదని చెప్పిన మాటను వైసిపి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా విద్యుత్ ఛార్జీల రూపంలో అదనపు భారం విధించడం సరికాదన్నారు. 2015లో బకాయిఉన్న విద్యుత్ సంస్థల బాకీలను పూడ్చేందుకు ఇప్పుడు ప్రజలపై అధిక భారాలు వేయడం సమంజసం కాదన్నారు. విద్యుత్తు ఛార్జీలు తగ్గించని పక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు కె.విశ్వనాథం, జి.వీరబాబు, కె.మణి, సూర్యనారాయణ, రాజేష్ ఎం.అర్జున్ రావు, కొత్తపెళ్లి మండల సిఐటియు నాయకులు నాగేశ్వరరావు, కెవివి సత్యనారాయణ, సిహెచ్.సాంబశివ, జి.అప్పారావు, సూర్యప్రకాష్, నాగన్న, సత్తిబాబు, అప్పారావు, ప్రసాద్, మాణిక్యాలరావు, అప్పన్న, డి.శ్రీనివాసు, గుణేశ్వరరావు పాల్గొన్నారు.










