ప్రజాశక్తి-గుంటూరు, సత్తెనపల్లి : పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య పిలుపునిచ్చారు. విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలు గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని పుతుంభాక భవన్‌లో సోమవారం నిర్వహించారు. గుంటూరులో సభకు సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ అధ్యక్షత వహించగా సత్తెనపల్లిలో సభకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ అధ్యక్షత వహించారు. తొలుత అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. గుంటూరు సభలో రామారావు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి టిడిపి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచినదని, వామపక్షాల ఆధ్వర్యంలో దీర్ఘకాలం ఉద్యమాలు జరిగాయని, చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ర్యాలీపై రాష్ట్ర ప్రభుత్వం కాల్పులు జరిపి సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిని కాల్చి చంపిందని గుర్తు చేశారు. వేలాది మందికి గాయాలయ్యాయని, నాటి ప్రభుత్వం చనిపోయిన అమరవీరులకు అసెంబ్లీలో కనీసం సంతాపం కూడా తెలియజేయలేదన్నారు. ఈ ఉద్యమ ప్రభావంతోనే నాటి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికీ అదేగతి పడుతుందని హెచ్చరించారు. సిపిఐ (ఎంఎల్) రెడ్‌స్టార్ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.హరిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణల చట్టంలో భాగంగానే రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును కూడా రద్దు చేసే ప్రమాదం ఉందన్నారు. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గనిరాజు మాట్లాడుతూ సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, కస్టమర్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నా విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, నాయకులు ఎం.ఏ.చిష్టి, బి.శ్రీనివాసరావు, కె.సుధీర్, ఆది నికల్సన్, ఎం.కిరణ్, బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.
సత్తెనపల్లి సభలో చలమయ్య మాట్లాడుతూ అప్పట్లో చంద్రబాబు సిఎంగా విద్యుత్ సంస్కరణలో పేరుతో విద్యుత్తు ప్రైవేటీకరించి చార్జీలను అడ్డగోలుగా పెంచారని, దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన విద్యుత్ ఉద్యమం మహోద్యమంగా జరిగిందని అన్నారు. ఆ ఉద్యమ ప్రభావంతో మళ్లీ విద్యుత్ ఛార్జీలను పెంచటానికి ఏ ప్రభుత్వమూ సాహసించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, సామాజిక తరగతుల వారికి ఉచిత విద్యుత్తు అమలు చేయాల్సి వచ్చిందని అన్నారు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంలోని బిజెపి ఆడించినట్లు ఆడుతూ ఇప్పటికి ఏడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. వైసిపి ప్రభుత్వమూ జనాగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజానీకమంతా మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సభలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు జి.ఉమశ్రీ, షేక్ సైదులు, రాజకుమార్, పి.ప్రభాకర్, వీరబ్రహ్మం, కె.శివదుర్గారావు, ఎం.జగన్నాథరావు, బి.భాస్కర్ పాల్గొన్నారు.










