Oct 10,2023 21:52

కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   ప్రజలపై భారాలు మోపుతూ పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే ఉపసం హరించుకోకపోతే ఐక్యంగా పోరాడుదామని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యుత్‌ సంస్కరణలు, భారాలపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారం మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బళ్లారి బైపాస్‌ నుంచి తపోవనం సర్కిల్‌ వరకూ విద్యుత్‌ బారాలను తెలియజేసే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వాలు విద్యుత్‌ ఛార్జీలు పెంపుదల చేసి భారాలు మోపడం దుర్మార్గంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాటగా మార్చి దగా చేస్తున్నారని పాలకులను విమర్శించారు. సిఎం జగన్‌ చెప్పింది ఒకటి.. అమలు చేస్తోంది మరకటిగా ఉందన్నారు. ఎప్పుడో వినియోగించిన విద్యుత్‌కు సెస్‌ అంటూ, ట్రూప్‌ ఆఫ్‌ చార్జీలంటూ విద్యుత్‌ భారాల మోత మోగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్‌ మీటర్‌లు బిగించి వినియోగదారులను దోపిడి చేసే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్‌ చార్జీలను తగ్గించాల్సింది పోయి పెంపుదల చేయడం ప్రజలను మరింత ఇబ్బందుల్లో నెట్టివేయడమే అవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కాని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడ ఆ పథకానికి కూడా తూట్లు పొడిచేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపారు. ఒక్క విద్యుత్‌ భారాలే కాకుండా వివిధ రంగాల్లో కూడా ప్రజలు భారాలు మోసే దయనీయ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ప్రభుత్వాల అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు ప్రజలు పోరాటాల్లో భాగస్వాములు కావాలన్నారు. వామపక్షాలుగా నిరంతరం పోరాటాలు కొనసా గిస్తామని ప్రజల మద్దతు కలిసివస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు వై.వెంకటనారాయణ, నగర కమిటీ నాయకులు వలి, రాజు, బాబా, వెంకటేష్‌, లక్ష్మీనారాయణ, ఎన్టీఆర్‌ శీనా, గపూర్‌, ఎర్రిస్వామి, ఆవాజ్‌ నాయకులు ఇస్మాయిల్‌, శర్మాస్‌, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నగర నాయకులు రమణయ్య, అల్లీపీరా సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు నాగరాజు, వీరనారప్ప తదితరులు పాల్గొన్నారు.