విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలో విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ఏఈ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యుత్ సీనియర్ ఎస్‌ఎల్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అన్వర్‌బాషా మాట్లాడుతూ విపరీతమైన విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోతలను తగ్గించి, విద్యుత్ ఛార్జీలపై ఉన్న ట్రూ అప్ ఛార్జీలను, యూజర్ ఛార్జీలను, ఎత్తివేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక భారాలు మోపుతూ విపరీతమైన విద్యుత్ ఛార్జీలు పెంచి అంతేస్థాయిలో విద్యుత్ కోతలు కూడా విధించడం సిగ్గుచేటన్నారు. విద్యుత్ పనిపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. విద్యుత్ కోతల వల్ల వారు ఉపాధి కోల్పోతున్నారన్నారు. అలాగే రాత్రుల్లో విద్యుత్ కోతలు ఉండడం వల్ల పసిపిల్లలు, వృద్ధులు ఉక్కపోత, దోమల వలన నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఎల్‌సిలు ఇవ్వొద్దని విద్యుత్ ఏఈని కోరారు. కార్యక్రమంలో ఎస్‌డి సందాని, ఎస్‌కె మస్తాన్ షరీఫ్, ఎస్‌కె ఖాజా రహంతుల్లా, తదితరులు పాల్గొన్నారు.










