ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్రంలోని వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ భారాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పలనర్స పిలుపునిచ్చారు. పాడేరు సిపిఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం సిపిఎం, సిపిఐల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన ప్రజా, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. సిపిఐ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్శ మాట్లాడుతూ, స్థిర చార్జీలు, కస్టమర్, విద్యుత్ సుంకం, ట్రూ అప్ చార్జీలు, 2014 సంవత్సరం నుండి 2019 వరకు, అక్కడి నుండి 2021 సంవత్సరంలో ఇంధన కొనుగోలు సర్దుబాటు, 2023లో ఇంధన కొనుగోలు సర్దుబాటు చార్జీల పేరుతో, అసలు కరెంట్ బిల్లు కాకుండా, బిల్లుపై మరో ఆరు రకాల అదనపు బిల్లులు వేసి విద్యుత్ వినియోగదారుల జేబులు లూటీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసిందన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో మరో భారం, విద్యుత్ వినియోగదారులపై వేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రకటించిందని, ప్రతి ఇంటికి ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించనున్న ప్రభుత్వం, స్మార్ట్ మీటర్ల డబ్బులను 10 సంవత్సరాల పాటు 120 నెలలు వినియోగదారుల బిల్లులో వేసి వసూలు చేయనుందని అన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కంటే, ఆదాని సేవల కోసమే జగన్ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు. ఇప్పటికే నూతన విద్యుత్ విధానం పేరుతో 20వేల కోట్లు విద్యుత్ వినియోగదారుల నుండి గుంజుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో చేసుకున్న అడ్డగోలు ఒప్పందాలు, బొగ్గు సరఫరా, అవినీతి కార్పొరేట్లకు మేలు చేసే చర్యలు, విద్యుత్ సంస్థల అపసవ్య విధానాలతో విద్యుత్ చార్జీల భారం తడసి మోపెడవుతోందని అన్నారు. సర్దుబాటు చార్జీల భారాన్ని ప్రభుత్వాలే భరించాలని విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో విద్యుత్ నియంత్రణ మండలి విఫలమయిందని విమర్శించారు. ప్రజలంతా సంఘటితమై మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సత్యనారాయణ, సిపిఎం మండల కార్యదర్శి ఎల్ సుందర్రావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కే ప్రభుదాస్, జన వేదిక నాయకులు ఆనందరాజు పాల్గొన్నారు.










