ప్రజాశక్తి-చీరాల: పెంచిన విద్యుత్తు చార్జీలకు నిరసనగా చీరాల విద్యుత్తు డివిజనల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీఈఈ శ్రీనివాసరావుకు నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్తు చార్జీలు పెంచారని ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాటినుంచి ఇప్పటి వరకు 8 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచారంటే ప్రభుత్వం తీరును ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలను పూర్తిగా అదుపులోకి తెస్తామని హామీనిచ్చిన సీఎంకు ఆ హామీలు గుర్తుకు రావా అని ప్రశ్నించారు. ఇక బిజేపీ పాలిత రాష్ట్రాలు సైతం స్మార్ట్ మీటర్ విధానాన్ని పక్కన పెడితే కేవలం లబ్ధి కోసం జగన్‌మోహన్‌రెడ్డి స్మార్ట్ విధానం ఏపీలో ప్రవేశ పెట్టారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యుత్తు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దుచేయాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శామ్యూల్, వెంకట్రావు, బాబూరావు, శివరాంప్రసాద్, వెంకటేశ్వర్లు, రవికుమార్, విజరు, జిలాని తదితరులు పాల్గొన్నారు.
అద్దంకి: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను ముఖ్యమంత్రి అనేకసార్లు పెంచి బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాల వారిని ఆర్థికంగా దోచుకుంటున్నారని సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం వామపక్షాల పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ కార్యకర్తలు నాయకులు విద్యుత్ భారాలను తగ్గించాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాన్యుడికి వచ్చే విద్యుత్ బిల్లును చూస్తే గుండెలు ఆగిపోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ధ్రువపు చార్జీలు, సర్దుబాటు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు కెఎల్టి ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్తు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా ఉన్నాయన్నారు. అనంతరం విద్యుత్తు బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి వెంకట్రావు, పి ఆదాం వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటోరైటప్ణ్-వేటపాలెం సెంటర్‌లో విద్యుత్ చార్జీలు తగ్గించాలని ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్షాల నాయకులు
పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి.
వేటపాలెం: పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక పట్టణ పురవీధుల్లో కొనసాగించారు. ఈ ర్యాలీ అనుమల్లిపేట నుంచి చిన్నబజారు మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ధరల వలన సామాన్యుల నడ్డి విరిచినట్లుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మచ్చా అయ్యప్పరెడ్డి, కర్రి ఆంజనేయులు, సిపిఐఎంఎల్ నాయకులు వార్తి కోట సుబ్బారావు, ఎటిఎఫ్‌టియు నాయకులు పింజల భూషణబాబు, ప్రజాతంత్ర కార్మిక సంఘం నాయకులు లేళ్ల రమేష్, పసుమర్తి చంద్రమౌళి, గుత్తి హనుమంతరావు, భారతీయ కిసాన్ యూనియన్ లోహియా పాల్గొన్నారు.
సంతమాగులూరు: పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచన ఉపసంహరించుకోవాలని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సంతమాగులూరు విద్యుత్ స్టేషన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నా ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి మల్లెల ఏసోబు, షేక్ ఖాదర్‌బాషా మాట్లాడారు. ప్రజల ఆదాయాలకు చిల్లులుపడే విధంగా కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టే విధంగా కరెంటు చార్జీలు పెంపుదల ఉందన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి, స్మార్ట్ మీటర్లకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ముందుగా ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బస్టాండ్ సెంటర్ నుంచి విద్యుత్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అద్దంకి నాగేశ్వరరావు, రమణయ్య, ముస్తఫా, ధనమ్మ, నాగూర్‌వలి తదితరులు పాల్గొన్నారు.










