Oct 19,2023 23:58

గంగవరంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఐ నేతలు

ప్రజాశక్తి -గాజువాక :పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించేలా మరో ఉద్యమం చేపడతామని సిపిఐ నేతలు హెచ్చరించారు. గురువారం సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గంగవరం గ్రామంలో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ సంస్కరణలను తుచ తప్పకుండా పాటిస్తూ, రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తామన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్‌ ఛార్జీలను పెంచేది లేదంటూ హామీనిచ్చిన ముఖ్యమంత్రి గడచిన నాలుగున్నరేళ్ల ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచి వినియోగదారులపై వేల కోట్ల భారం వేశారన్నారు. ఇదిచాలదన్నట్లు ఎపుడో పదేళ్ల క్రితం వాడిన కరెంట్‌కు ఇపుడు ట్రూఅప్‌, సర్దుబాటు, ఇంధన సర్‌ఛార్జీలంటూ ప్రతినెలా బిల్లులపై అదనపు ఛార్జీలను వేసి వసూలు చేయడం దుర్మార్గమన్నారు. సామాన్య వినియోగదారులే కాకుండా చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలపై మోయలేని విద్యుత్‌ ఛార్జీల భారం వేసిన వైసిపి ప్రభుత్వం వెంటనే తాను చేసిన తప్పును తెలుసుకుని, కరెంట్‌ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో సిఎం జగన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా ప్రజలను సమాయత్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు పల్లేటిపోలయ్య, పి.దుర్గారావు, కె.పోతన్న, సోమేష్‌ , మాధవరావు, వై. నందన్న, మహిళా సమాఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.