Jun 23,2023 23:55

సమావేశంలో మాట్లాడుతున్న సిహెచ్‌.బాబూరావు

ప్రజాశక్తి-గుంటూరు : విద్యుత్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈనెల 30న వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్‌ కార్యాలయాలు, సబ్‌స్టేషన్‌ల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబురావు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో సంప్రదించకుండా, ఏకపక్షంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచిందన్నారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్‌ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు, స్థిర ఛార్జీల పేరుతో అసలు బిల్లు కంటే అదనపు ఛార్జీల భారం మోపిందన్నారు. 2014 నుండి 2019 వరకూ వినియోగించుకున్న విద్యుత్‌పై రూ.2900 కోట్లు, ఇప్పుడు వినియోగదారునిపై భారాలు మోపడం అన్యాయమని, తక్షణమే ట్రూఅప్‌, సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావవసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు పెరిగిపోయాయని, ఇప్పుడు విద్యుత్‌ ఛార్జీలు కూడా పెంచారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని జరుగుతున్న పాదయాత్రకు సిపిఎం జిల్లా కమిటీ సంఘాభావం తెలిపిందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో గత 50 ఏళ్ల నుండి వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, రాజధాని ప్రాంతంలో ఏ గ్రామంలోని పేదలకు ఆ గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఆ ప్రాంతంలోని పేదలకు ఉపాధి ఆవకాశాలు కల్పించాలని కోరారు. పోలవరం నిర్వాశితుల పాదయాత్రకు సంఘీభావంగా ప్రజలు ఆర్థిక, వస్తు రూపేణా సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. భూయజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు ఛానల్‌, కొండవీడు వాగులో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటుకాడలను తొలిగించాలని, కాల్వలలో పూడిక తీయించి నీటి పారుదలకు అవకాశం కల్పించాలని సమావేశం డిమాండ్‌ చేసింది. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, ఎన్‌.భావన్నారాయణ, ఇ.అప్పారావు, కె.నళినీకాంత్‌, నాయకులు బి.కోటేశ్వరి, ఎల్‌.అరుణ, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.